Kannappa: కన్నప్ప హార్డ్‌డిస్క్ దొంగతనం: క్లారిటీ ఇచ్చిన టీమ్

టాలీవుడ్‌లో భారీగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాకు సంబంధించి హార్డ్‌డిస్క్‌ దొంగతనం వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమా బృందం తెలిపిన వివరాల ప్రకారం, ముంబయిలోని హైవ్ స్టూడియోస్ నుంచి హైదరాబాద్‌లోని నిర్మాణ కార్యాలయానికి తరలిస్తున్న హార్డ్‌డిస్క్‌ను అనుమతి లేకుండా తీసుకెళ్లారంటూ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. దాంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ స్పందిస్తూ, ఈ హార్డ్‌డిస్క్‌లో రెండు ప్రధాన పాత్రల మధ్య కీలక యాక్షన్ సన్నివేశం, ముఖ్యమైన VFX వర్క్ ఉన్నట్లు పేర్కొంది. చరిత అనే మహిళ సూచనలతో శ్రీ రఘు అనే వ్యక్తి డెలివరీ పేరుతో సంతకం చేసి డిస్క్‌ను తీసుకెళ్లాడని తెలిపింది. వీరిద్దరూ తమ సంస్థకు సంబంధిత వ్యక్తులు కాదని స్పష్టం చేసింది. దీని వెనుక ఉన్న శక్తులు తమకు తెలుసని, ఇది సంపూర్ణంగా కావాలనే నష్టాన్ని కలిగించేందుకు పూనుకున్న కుట్ర అని అభిప్రాయపడింది.

హార్డ్‌డిస్క్‌ను అపహరించిన వ్యక్తులే ఈ సినిమాకు తీవ్రంగా నష్టం కలిగించాలనే ఉద్దేశంతో, దాదాపు 90 నిమిషాల ఫుటేజ్‌ను లీక్ చేయాలనే పథకంతో ఉన్నారని నిఘా వర్గాల సమాచారం పేర్కొంది. అందుకే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని సంస్థ వెల్లడించింది.

తెలుగు సినిమా పట్ల ప్రపంచవ్యాప్త గౌరవం పెరుగుతున్న వేళ, ఇలా చౌకబారు కుట్రలకు దిగజారడం దురదృష్టకరమని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ టీమ్ అటు మానసికంగా, ఇటు నైతికంగా బలంగా ఉందని, కన్నప్పను సినీ చరిత్రలో గుర్తుండిపోయే చిత్రంగా రూపొందించేందుకు అంకితభావంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

జగన్ అరెస్ట్ అసంభవం|| Parrot Astrology Prediction On 2029 AP CM | Chilaka Jyotsyam On YS Jagan || TR