మెగాస్టార్ చిరంజీవి బాటలో మెగా ఫ్యామిలీకి చెందిన చాలా మంది హీరోలు మంచి సినిమాలతో దూసుకెళుతున్నారు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత చిత్రంతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. దీంతో పులివాసు దర్శకత్వంలో తన రెండో సినిమా చేశాడు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రిజ్వాన్, ఖుషి నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ని కొద్ది రోజుల క్రితం పూర్తి చేశారు. కుటుంబ విలువలతో అంతమైన ప్రేమ కథా చిత్రంగా దీనిని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ప్రగతి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, జబర్దస్థ్ మహేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజాగా కళ్యాణ్ దేవ్ తన మూడో సినిమా మొదలు పెట్టారు. యంగ్ డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తళ్ళూరి ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మించనున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రం కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ కూకట్ పల్లిలోని తులసి వనం శ్రీవెంకటేశ్వర దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి వెంకీ కుడుముల, యువ దర్శకులు ప్రణీత్, వేణు ఉడుగల ముఖ్య అతిధులుగా విచ్చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
దీపావళి కానుకగా నవంబర్ 14న ఉదయం 10గంలకు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారు. చిత్రానికి దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. గతంలో సాయితేజ్ కల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించడం విశేషం. అలానే ఛలో,భీష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు.