April Box Office: బాక్సాఫీస్: ఏప్రిల్ పోరులో గెలిచేదెవరు?

మార్చి నెల బాక్సాఫీస్‌కు మంచి ఊరటను ఇచ్చింది. ‘కోర్ట్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకొని విజయాన్ని అందుకున్నాయి. వేసవి సెలవులు ప్రారంభమయ్యే వేళలో ఏప్రిల్ సినిమాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రాబోతున్న నేపథ్యంలో, ఫిల్మ్ మేకర్స్ కూడా రిలీజ్‌లను సమయానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలైన ‘కన్నప్ప’, ‘ఘాటీ’ వాయిదా పడటం మాత్రం థియేటర్లలో పోటీ తక్కువయ్యేలా చేసింది.

ఈ నెల 10న సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’తో పోటీ ప్రారంభమవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై మంచి అంచనాలున్నాయి. అదే రోజు అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తెలుగులో విడుదల కానుంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ చేస్తున్నారు. తర్వాతి రోజు ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ విడుదల కానుంది. ఈ సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది.

ఏప్రిల్ 17న తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల 2’ థియేటర్లకు రానుంది. మొదటి భాగం ఆకట్టుకున్న నేపథ్యంలో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. మరుసటి రోజు విడుదలవుతున్న ‘సారంగపాణి జాతకం’ పబ్లిసిటీపై ఆధారపడి రాబోయే రోజుల్లో బజ్ పెంచే ప్రయత్నంలో ఉంది. ఇక ‘కన్నప్ప’ విడుదల వాయిదా పడిన నేపథ్యంలో, ఆ స్పేస్‌ను ‘భైరవం’ భర్తీ చేసే అవకాశాలున్నాయని టాక్. కానీ నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ పెద్ద సినిమాలతో పాటు ‘చౌర్య పాఠం’, ‘28 డిగ్రీస్ సెల్సియస్’, ‘ఎర్రచీర’, ‘లవ్ యువర్ ఫాదర్’ వంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటి విజయావకాశాలు కంటెంట్ మీదే ఆధారపడి ఉంటాయి. మార్చి తరహాలో ఏప్రిల్ కూడా హిట్‌ల జాతర అవుతుందా లేక నిరాశ మిగిల్చుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. మరి వేసవి వేడిలో ఏ చిత్రం మురిపిస్తుందో వేచి చూడాలి!