అనుకున్న తేదీ ఆగస్ట్ 15న ఎలాగైనా విడుదల చేయాలని ‘పుష్ష -2’ టీమ్ షూటింగ్ పూర్తి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకు తగ్గట్టే రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. అయితే ఐటమ్ సాంగ్ కోసం ఇంతవరకూ ఎవరినీ ఖరారు చేయలేదని తెలుస్తోంది. చివరకు జాన్వీ కపూర్‌ను ఒప్పించేలా డైరెక్టర్ సుకుమార్ ఉన్నట్లు టాక్. ఈ సినిమా కోసం మలేషియాలో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించాలనుకొన్నారు.
అయితే ఇప్పుడు అంత టైమ్ లేదు. అందుకే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీనే మలేషియాగా మారుస్తున్నారు. అక్కడ ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. అక్కడే మలేషియాలో తెరకెక్కించాల్సిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ‘పుష్ష 2’ షూటింగ్ ఎంత వేగంగా జరుగుతున్నా టీమ్‌ని రెండు విషయాలు ఇబ్బంది పెడుతున్నాయని తెలుస్తోంది. ఒకటి.. ఫహద్ ఫాజిల్ ఈ సినిమాకు డేట్లు కేటాయించడం లేదు.
ఈ సినిమాలో ఫహద్ కీలక ప్రాత పోషిస్తున్న సంగతి తెలిసిందే. తనపై ఇప్పటికే కొంతమేర షూటింగ్ చేశారు. అయితే మరో 15 రోజుల కాల్షీట్లు అవసరం అయ్యాయి. కానీ ఫహద్‌కు ఉన్న బిజీ కారణంగా డేట్లు కేటాయించడం లేదు. మరోవైపు ఐటెమ్ సాంగ్ చేసే హీరోయిన్ సమస్య కూడా వెంటాడుతోంది. ఐటెమ్ గాళ్‌గా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదని తెలుస్తోంది. చాలామంది అగ్ర కథానాయికల పేర్లు పరిశీలించారు.
కానీ ఏదీ ఇంకా ఫైనల్ కాలేదు. ఎవరూ దొరకని పక్షంలో ఈ పాటని జాన్వీకపూర్‌తో చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంలో ఈ వారంలో ఓ స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఇటీవల ‘పుష్ష 2’ నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. మరో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.