ఇది విన్నారా… జూనియర్‌ ఎన్టీఆర్‌కు జాన్వీకపూర్‌ మేనత్త నట..?

సోషల్‌ మీడియాలో కొందరు పెట్టే పోస్టులు చాలా చమత్కారంగా ఉంటాయి. అందులోనూ కొందరు డిజిటల్‌ క్రియేటర్లు రూపొందించే కంటెంట్‌లో లోపాలను వెతుకుతూ, లేదంటే ఎగతాళి చేస్తూ కొందరు నెటిజనులు పెట్టే పోస్టులు మరీ చమత్కారంగా నవ్వు తెప్పిస్తాయి. మీ క్రియేటివీకి ఒక దండంరా బాబూ.. అనేలా ఉంటాయి. తాజాగా ఎక్స్‌లో వైరల్‌ అవుతోన్న ఒక పోస్ట్‌ చూస్తే ఇదే అనిపిస్తుంది. ఇంత లోతుగా ఎలా ఆలోచిస్తారురా బాబూ అనిపిస్తుంది.

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి తెలుగులో ఎన్టీ రామారావు దగ్గర నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వరకు ఎంతో మంది హీరోల సరసన నటించారు. అయితే, బాలకృష్ణకు మాత్రం ఆమె హీరోయిన్‌గా నటించలేదు. దీనికి బాలకృష్ణ నిర్ణయమే కారణమనే వాదనలు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. తన తండ్రితో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవితో తాను ప్రేమికుడిగా, భర్తగా నటించలేనని బాలకృష్ణ అనేవారట.

అసలు ఎన్టీఆర్‌కు భార్యగా నటించిన శ్రీదేవి తనకు తల్లితో సమానమని కూడా బాలయ్య అన్నారనే రూమర్లు ఉన్నాయి. ఇదే విషయం చెబుతూ ఎవరో డిజిటల్‌ క్రియేటర్‌ ఒక వీడియో చేశారు. అయితే, ఆ వీడియోను ఒక ఎక్స్‌ యూజర్‌ పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ఆధారంగా వరుసలు కలుపుతూ జూనియర్‌ ఎన్టీఆర్‌కు జాన్వీ కపూర్‌ ఏమవుతారో లెక్కగట్టారు.

‘బాలకృష్ణ గారికి తల్లి లాంటిది అంటే జూనియర్‌ ఎన్టీఆర్‌కి నాయనమ్మ. నాయనమ్మ కూతురు జాన్వీ కపూర్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌కి అత్త అవుతుంది. మేనల్లుడు అత్తతో కాంబోనా.. వాట్‌ ద ఫన్ ఇన్‌ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఈజ్‌ గోయింగ్‌ ఆన్‌ హియర్‌ (అసలు ఇక్కడ ఏం జరుగుతోంది)’ అంటూ సరదాగా ఎక్స్‌లో కామెంట్‌ చేశారు.

అయితే, ఈ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. చాలా మంది సరదాగా ఈ పోస్ట్‌కు స్పందిస్తున్నారు. ఇదే సమయంలో సీనియర్‌ ఎన్టీఆర్‌కు శ్రీదేవి మనవరాలిగా నటించిన విషయాన్ని కూడా కొందరు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి పోస్టులను సోషల్‌ మీడియాలో చూస్తుంటే ఇలా ఎలా ఆలోచిస్తారురా.. మీ తెలివి సంతకెల్లా అని అనిపిస్తుంటుంది!!