యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాల్ని లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం యువీ క్రియేషన్స్ లో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న పిరియాడిక్ లవ్‌స్టోరీ `రాధేశ్యామ్` లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత వైజయంతీ మూవీస్ చిత్రాన్ని ప్రభాస్ అంగీకరించిన విషయం తెలిసిందే. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ కథతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నామంటూ భారీగా ప్రకటన అయితే ఇచ్చారు కానీ.. రియాలిటీ మాత్రం వేరుగా ఉందట. బడ్జెట్ సర్థుబాటు పరంగా వైజయంతీ మేకర్స్‌కి చుక్కలు కనిపిస్తున్నాయట.
వైజయంతీ మూవీస్‌కి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారంగా మారినట్టు తెలుస్తోంది. హీరో ప్రభాస్‌కి, హీరోయిన్ దీపికా పదుకునేకి అడ్వాన్స్‌లు ఇవ్వడం వరకు ఓకే అని ఆ తరువాతే మేకర్స్‌కి ఈ ప్రాజెక్ట్ ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. భారీగా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసినా ఫైనాన్షియర్స్ మాత్రం ముందుకు రావడం లేదట. కారణం కరోనా అని తెలిసింది. దీని కారణంగా ఫైనాన్షియర్స్ ముందుకు రాకపోవడంతో భారీ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజులని భాగస్వాములుగా చేర్చి ముందుకు వెళ్లాలని ప్రయత్నించినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది.
ఈ ఎఫక్ట్‌కి కారణం `సాహో` ఫలితమే అని కొంత మంది అంటుంటే మరి కొంత మంది మాత్రం కుర్ర దర్శకులు భారీ బడ్జెట్ చిత్రాల్ని భారీ స్టార్ డమ్ వున్న హీరోల్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేరన్నది మరో వాదనగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న `రాధేశ్యామ్` ఫలితాన్ని బట్టి ఫైనాన్స్ చేస్తామని కొంత మంది ఫైనాన్షియర్స్ చెబుతున్నారట. దీంతో తన వద్ద వున్న డబ్బుతో ముందు షూట్ మొదలుపెట్టాలని, ఆ తరువాత ఫైనాన్షియర్స్ ని బుట్టలో వేయాలని ప్లాన్ చేస్తున్నారట.