ప్రేమ, ఫ్యాక్షన్ లాంటి రొటిన్ సినిమాలను తీసి తీసి బోర్ కొట్టినట్లుగా ఉందనుకుంటా దర్శకులకు అందుకే ఈ మధ్య కాలంలో ప్రముఖుల బయోపిక్ ల మీద ఆసక్తి చూపిస్తునారు. అంతేకాదు గత కొంత కాలంగా ఈ బయోపిక్స్ చూడటానికే ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలువురి జీవి కథలని సిలివర్ స్క్రీన్ మీదకి తీసుకు వచ్చారు.
‘సావిత్రి’, ‘ఎన్.టి.ఆర్’, ‘యాత్రా, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, హిందీలో ‘దంగల్’, కపిల్ దేవ్ బయోపిక్ ’83’, గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్ బయోపిక్ గా వచ్చిన ‘సూపర్ 30′.. సిల్క్‌స్మిత బయోపిక్ ‘డర్టీ పిక్చర్’, ఎంఎస్ థోని − ది అన్‌టోల్డ్ స్టోరీ’, మన్మోహన్ సింగ్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ వంటి బయోపిక్ చిత్రాలు తెరమీదికి వచ్చాయి వస్తున్నాయి.. ఇంకా త్వరలో తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత మీద రెండు సినిమాలు సిద్దంగా ఉన్నాయి.
ఇలా రాజకీయనాయకుల, క్రీడాకారుల, సినీతారల, వ్యాపారవేత్తలతో పాటుగా, వివిధ రంగాలలోని వ్యక్తులకు సంబంధించిన విజయగాధాలను మన సినీ దర్శకులు ఆదర్శంగా తీసుకొని, కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కాగా తాజాగా సూర్య కథానాయకుడుగా వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రానికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో మరో బయోపిక్ తెరకెక్కబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సంస్థల అధినేత రతన్ టాటా జీవితకథ.
ఈ బయోపిక్ లో టైటిల్ రోల్ ను ప్రముఖ నటుడు మాధవన్ పోషించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజక్టు ప్రాథమిక దశలో వుందని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని అంటున్నారు. అయితే రతన్ టాటా పాత్రకు మాధవన్ తప్ప మరెవరూ సూటవరని ఫిక్స్ అయిన చిత్రబృందం ఈ నటున్ని ఒప్పించే పనిలో పడ్డారట. మరి మాధవన్ ఈ పాత్రను ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.