కటక్‌లో భారత్ క్రికెట్ ఊచకోత.. 74కే సౌతాఫ్రికా ఆలౌట్.. టీ20 సిరీస్‌కు శుభారంభం..!

వన్డే సిరీస్ గెలిచిన ఊపులోనే టీమ్ ఇండియా.. టీ20 తొలి కూడా విజయం ప్రారంభించింది. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరులో భారత జట్టు ప్రత్యర్థిని పూర్తిగా తుడిచిపెట్టేసింది. కటక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ 101 పరుగుల ఘన విజయం నమోదు చేసింది. ఈ విజయంలో భారత జట్టు ఆధిపత్యం మొదటి ఓవర్ నుంచే స్పష్టంగా కనిపించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా స్కోర్‌ను ముందుకు నడిపించింది. అయితే మిడిల్ ఓవర్లలో అవసరమైన చోట రిస్క్ తీసుకుంటూ స్కోర్‌ను పరుగుల బాట పట్టించింది. వికెట్లు పడుతూనే ఉన్నా చివరి ఓవర్ల్లో వచ్చిన భారీ షాట్లు భారత్‌ను 175 పరుగుల గౌరవనీయమైన స్కోర్‌కి చేర్చాయి. ఇది టీ20లో అత్యధిక స్కోరు కాకపోయినా, కటక్ పిచ్‌కు ఇది గట్టి లక్ష్యంగానే కనిపించింది.

లక్ష్య చేధనకు దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభం నుంచే తడబడింది. భారత బౌలర్ల పేస్, స్వింగ్, స్పిన్‌లకు ప్రత్యర్థి బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. పరుగుల ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 12.3 ఓవర్లకే 74 పరుగులకు ఆలౌటయ్యారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ మార్క్రమ్ 14, స్టబ్స్ 14, యాన్సెన్ 12 పరుగులు చేశారు. అయితే వీరి పోరాటం భారత బౌలింగ్ తుపాను ముందు చిన్నపిల్లల ఆటగా మారిపోయింది. మిగతా బ్యాటర్లు డబుల్ డిజిట్‌కే చేరకముందే పెవిలియన్ చేరారు.

ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్ యూనిట్ నిజంగా హైలైట్‌గా నిలిచింది. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని ఊపిరి ఆడనివ్వలేదు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబే కూడా ఒక్కో వికెట్ తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని మరింత వేగవంతం చేశారు. వేగం, కంట్రోల్, బౌన్స్, టర్న్.. అన్నింటినీ కలిపి భారత బౌలింగ్ దాడి ప్రత్యర్థి నిలవలేకపోయింది. చివరికి 101 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్, టీ20 సిరీస్‌కు శుభారంభం పలికింది. ఈ ఘన విజయం జట్టుకు మరింత విశ్వాసాన్ని నింపింది. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇలాగే ఆడితే సిరీస్ మొత్తం భారత్ ఖాతాలోకే వెళ్లిపోతుందన్న నమ్మకం అభిమానుల్లో బలపడుతోంది.