ఆసియా కప్ 2025లో టీమిండియా మూడో విజయం సాధించింది. శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచి సూపర్ ఫోర్‌కు అడుగుపెట్టింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. యూఏఈ, పాకిస్థాన్‌పై ఇప్పటికే విజయాలు సాధించిన భారత్, ఒమన్‌ను కూడా ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒమన్ జట్టు చివరి వరకూ పోరాడి ఓడింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో రాణించాడు. భారత ఆటగాళ్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ పవర్‌ప్లేలోనే చెలరేగి 38 పరుగులు కురిపించాడు. తిలక్ వర్మ (29), అక్షర్ పటేల్ (26) కీలక సమయాల్లో తోడ్పడ్డారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా స్కోరు 188కి చేరుకుంది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, జితెన్, అమీర్ కలీమ్ చెరో రెండు వికెట్లు తీశారు.
భారత్ ఈ మ్యాచ్ కేవలం ప్రాక్టీస్ గానే భావించింది. అయితే అనుకున్నదానికంటే గట్టి పోటీ ఇచ్చిన ఒమన్ జట్టు లక్ష్య చేధనలో అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు పవర్‌ప్లేలో ఆడిన తీరు చూసి స్టేడియంలో కూర్చున్న అభిమానులే కాదు, టీమిండియా బౌలర్లు కూడా ఆశ్చర్యపోయారు. అమీర్ కలీమ్ (64), జితేందర్ సింగ్ (32), మీర్జా (51) కలిసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చారు. చివరి ఓవర్ల వరకు పోరాడినప్పటికీ విజయం మాత్రం ఒమన్‌కు అందలేదు. 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేయగలిగింది.
టీమిండియా బౌలర్లు చివరి దశలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. స్పిన్ బౌలింగ్ కంటే పేసర్లు ఒమన్ బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చారు. జట్టులోని అనుభవజ్ఞుల కారణంగా చివరకు భారత్‌కు గెలుపు అందించింది. ఈ విజయంతో టీమిండియా సూపర్ ఫోర్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతోంది. ముఖ్యంగా యంగ్‌స్టర్స్ ప్రదర్శన, మధ్యంతర భాగస్వామ్యాలు జట్టుకు బలాన్ని ఇచ్చాయి. మరోవైపు ఒమన్ జట్టు మూడు ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించినా.. చివరి మ్యాచ్ లో వారి ఆట అందరినీ ఆకట్టుకుంది.
