ఇంగ్లాండ్ పర్యటన అంటే భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. స్వింగ్, సీమ్‌కు అనుకూలమైన అక్కడి పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంటే ఒక యుద్ధమే. 1932లో తొలిసారి బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టి నేటి వరకు భారత జట్టు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కానీ ఒక విషయం మాత్రం ఇంకా అందరికీ గుర్తుండిపోయింది.. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు అదే కలను నెరవేర్చేందుకు భారత జట్టు మరోసారి సిద్ధమవుతోంది.
ఈసారి టీమిండియా బాధ్యతలు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భుజాలపై ఉంది.. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ టీమ్‌ను గైడ్ చేస్తున్నారు. ఇద్దరూ కొత్తవాళ్లే అయినా, వీరిలో ఉన్న శక్తి, స్ట్రాటజీపై భారత క్రికెట్ అభిమానులు నమ్మకం పెంచుకున్నారు. గతంలో గంభీర్ తన ఆటతీరు ద్వారా చూపిన ఫైటింగ్ స్పిరిట్, గిల్ ఆటలో కనిపించే స్టెయిలిష్ కాన్ఫిడెన్స్.. ఇవి జట్టుకు కావాల్సిన ఎనర్జీని అందించగలవని క్రీడా ప్రేమికులు భావిస్తున్నారు.
ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఇప్పటివరకు 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా, కేవలం 9 విజయాలు మాత్రమే దక్కించుకుంది. ఇది భారత క్రికెట్‌కు ఓ అంగీకరించలేని నంబర్. ఇక టెస్ట్ సిరీస్ పరంగా చూస్తే—20 సిరీస్‌లలో కేవలం 3 సిరీస్‌లు మాత్రమే భారత్ గెలవగలిగింది. 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో వచ్చిన ఆఖరి విజయం తర్వాత.. ప్రతి టూర్ ఒక నిరాశగానే మిగిలింది.
ఇప్పుడు ఆటగాళ్లు పూర్తిగా మారిపోయారు. వయసు మీద పడుతున్న రోహిత్, కోహ్లీ, అశ్విన్‌లకు బదులుగా.. యువత రంగంలోకి దిగుతోంది. గిల్, జైస్వాల్, రుతురాజ్, పటీదార్ లాంటి ఆటగాళ్లతో పాటు బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, చాహర్ వంటి సూపర్ టాలెంట్ సిద్ధంగా ఉంది. గతంలో యువ జట్టుతో గబ్బాలో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్ పిచ్‌ల స్వభావం బ్యాట్స్‌మెన్‌కు పరీక్షే. కానీ భారత బౌలింగ్ మాత్రం అదే పిచ్‌పై ఓ మాయ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, ఇంగ్లండ్ జట్టులో కూడా కొత్త బౌలర్లు ఉన్నప్పటికీ, వారి హోం అడ్వాంటేజ్ వారికి ఉంటుంది. ఈ నేపథ్యంలో గిల్ నాయకత్వం ఎంత నిలబడుతుందన్నదే అసలైన ప్రశ్న.
చరిత్రలో భారత్ తరఫున ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ (1571 పరుగులు). బౌలింగ్‌లో కపిల్ దేవ్ (85 వికెట్లు) టాప్‌లో ఉన్నారు. 2014లో లార్డ్స్‌లో ఇశాంత్ శర్మ 7/74తో చేసిన స్పెల్‌ను ఎవరూ మరిచిపోలేరు. ఇప్పుడు వీరిలాంటి గొప్ప విజయాల జాబితాలో చేరేందుకు కొత్త తరం ఎదురు చూస్తోంది. ఇంతకీ… ఈసారి భారత్ ఇంగ్లండ్ ను చిత్తు చేస్తుందా.. లేక మరికొన్ని సంవత్సరాలు ఈ కల అలాగే మిగిలిపోతుందా అనేది చూడాలి.