Team India: ఈ వేసవిలో భారత క్రికెట్ వేదికగా మరింత ఆసక్తికరంగా మారనుంది. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతున్న భారత-ఏ జట్టు ఎంపిక ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ప్రకటించిన జాబితాలో అనుభవంతో పాటు ఉత్సాహంగా ఉన్న యువ ఆటగాళ్లకు సమతుల్య ప్రాధాన్యం ఇచ్చారు సెలక్టర్లు. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనుండగా, వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ నియమితులయ్యాడు.
ఈ జాబితాలో తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న నితీశ్, ఈ పర్యటనలో తాను ఎంత స్థాయిలో రాణిస్తాడన్నది ఆసక్తికరం. అంతేకాదు, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ లాంటి అంతర్జాతీయ అనుభవం ఉన్నవారితో పాటు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, హర్షిత్ రాణా వంటి యువ తారలు కూడా ఈ జట్టులో ఉన్నారు. రెండో మ్యాచ్ నుంచి శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ చేరుతుండటం ద్వారా జట్టుకు మరింత బలం చేకూరనుంది.
ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఈ పర్యటనలో భాగంగా జరుగనున్నాయి. మే 30న కాంటర్‌బరీలో మొదటి మ్యాచ్, జూన్ 6 నుంచి నార్తాంప్టన్‌లో రెండో మ్యాచ్ జరగనుండగా, జూన్ 13 నుంచి బెక్హెమ్‌లో భారత సీనియర్ జట్టుతో అంతర్గత మ్యాచ్ కూడా నిర్వహించనున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ఈ సన్నాహక పోటీలు కీలకంగా నిలవనున్నాయి.
ఈ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టెస్టు స్థాయికి ఎదిగేందుకు ఎదురుచూస్తున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్, తొలి అవకాశం దక్కించుకున్న స్పిన్నర్ హర్ష్ దూబే లాంటి ఆటగాళ్లు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇండియా-ఏ జట్టు ఈ టూర్‌లో ఎలా రాణిస్తుందో చూడాల్సిందే.