సచిన్ సలహా విని తప్పు చేశా.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ ద్రవిడ్..!

భారత క్రికెట్ చరిత్రలో ది వాల్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ ద్రవిడ్. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందిన ద్రవిడ్, తన క్రికెట్‌ జీవితం మొత్తం మీద ఒకే ఒక నిర్ణయాన్ని ఇప్పటికీ విచారం వ్యక్తం చేస్తునట్లు తెలిపాడు. అది ఇంకేదో కాదు.. తన అత్యంత సన్నిహితుడు సచిన్ టెండూల్కర్ సలహా పాటించడమే అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన ఓ చిట్‌చాట్‌లో ద్రవిడ్ ఈ చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. ఆయన మాటల్లోనే 2011లో ఇంగ్లండ్ పర్యటనలో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో నేను బ్యాటింగ్ చేస్తున్నాను. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో బంతి వెనుక నుంచి స్లిప్‌లకు వెళ్లింది. అంపైర్ సైమన్ టఫెల్ నన్ను క్యాచ్ ఔట్‌గా ప్రకటించారు. కానీ నా బ్యాట్‌కు బంతి తగిలిన అనుభూతి నాకు రాలేదు. నేను సచిన్ వద్దకు వెళ్లి అడిగాను. ఆయన చాలా పెద్ద శబ్దం వచ్చింది యార్.. కచ్చితంగా బ్యాట్ తగిలిందని అన్నారు. ఆయన మాటలు విని రివ్యూ తీసుకోకుండా మైదానం వదిలి వెళ్లిపోయాను అని గుర్తు చేసుకున్నారు.

అయితే, డ్రెస్సింగ్‌రూమ్ చేరుకున్నాక రీప్లే చూసి ద్రవిడ్ షాక్ అయ్యాడు. అసలు బంతి బ్యాట్‌ను తాకకపోగా, ఆయన షూ లేస్‌కి తగిలిందన్న నిజం బయటపడింది. అంపైర్ నిర్ణయాన్ని అప్పట్లో సవాలు చేయడం అంత సులభం కాకపోవడంతో సచిన్ అభిప్రాయాన్ని నమ్మడం తన పెద్ద తప్పు అని ద్రవిడ్ అన్నాడు.

ఆ టూర్‌లో భారత్ 4-0 తేడాతో ఘోరంగా ఓడిపోయినా, ద్రవిడ్ మాత్రం అసాధారణ ప్రదర్శన చేశాడు. నాలుగు టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించి, 461 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో ఇంతటి ఘనతలు సాధించిన రాహుల్ ద్రవిడ్ వంటి లెజెండ్ కూడా.. ఒక సారి సచిన్ మాట విని తప్పు చేశా అని చెప్పడో అభిమానుల్లో షాక్ అవుతున్నారు.