Comedian Venu: చాలా మంది టాలెంట్ ఉన్న ఇప్పటికీ కృష్ణా నగర్ వీధుల్లో అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారంటే అతిశయోక్తి కాదు. కొంత మంది సినిమా మీద ఫ్యాషన్, పిచ్చితో వస్తే, మరికొందరేమో ఎటూ పాలుపోని స్థితిలో సినీరంగంలో సెటిల్ అవుదామని, తమ టాలెంట్‌ను నిరూపించుకునే వారు మరికొందరు. అలా ఈ రోజుకూ డైరెక్టర్ల ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ, వచ్చే ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తూ తమ కంటూ ఓ రోజు వస్తుందని నమ్మి జీవితాన్ని సాగిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి కోవకి చెందిన వారే కమెడియన్ వేణు.
జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకొని, తనకంటూ ఓ కమెడియన్ స్థాయి వచ్చిన వేణు జీవితంలోనూ ఇలాంటి గాథలే ఉన్నాయి. ఇండస్ట్రీకి రావడం ఒక ఎత్తయితే పరిశ్రమలో అవకాశాలు రావడం, వాటిని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. చిత్ర పరిశ్రమలోకి తాను ఎన్నో కష్టాలకు ఓర్చానని ఆయన ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు, అవమానాల గురించి వేణు తాజాగా పెదవి విప్పటంతో విన్న వారంతా సానుభూతిని వ్యక్తం చేయడంతో పాటు, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇకపోతే తాను ఇండస్ట్రీలో అవకాశాల కోసం అంట్లు తోమాను, బాత్రూంలు కడిగానని చెప్పుకొచ్చారు కమెడియన్ వేణు. ఇటీవల ఓ యూట్యుబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనకు ఏమీ తెలియదని.. కానీ స్క్రీన్ పైన కనిపించాలాన్న ఓకే ఒక్క ఉద్దేశంతో సినిమాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. అంతకు ముందు టచప్ బాయ్‌గా , మేకప్ అసిస్టెంట్‌గా, సెట్ బాయ్‌గానూ పనిచేశానని వేణు తెలిపారు. అవకాశాల కోసం ఇండస్ట్రీలో వ్యక్తులను పరిచయం చేసుకుని వాళ్ల కొంత కాలం వాళ్ల రూమ్‌లోనే ఉన్నానని.. కానీ వాళ్ళు ఇంట్లో మాత్రం తనని పని చేసే బాయ్‌గా ఉంచుకున్నారని ఆయన చెప్పారు. అలా కష్టపడుతూ వచ్చిన తనకు జబర్దస్త్ లైఫ్‌ని ఇచ్చిందని, ఆ తర్వాత సినిమాల్లోనూ చిన్న చిన్న కమెడియన్ క్యారెక్టర్‌లు చేస్తూ ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని వేణు ఆనందం వ్యక్తం చేశారు.