Pushpa 2: డిసెంబర్ 5న విడుదలకానున్న పుష్ప-2 పై అందరి దృష్టి ఉంది. సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు బాహుబలి-2 రికార్డును దాటించడమే లక్ష్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ప్రధానంగా టికెట్ రేట్ల పెంపు కీలకమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా చిత్రాలకు టికెట్ రేట్ల పెంపుకు ఇప్పటికే అనుమతులు లభిస్తున్నాయి.
గుంటూరు కారం, కల్కి, దేవర వంటి చిత్రాలకు 150-200 రూపాయల వరకు రేట్లు పెరిగాయి. కానీ పుష్ప-2కు మాత్రం ఈ సారి మూడింతలు పెంపు అనుమతిని కోరుతున్నారని సమాచారం. అంటే, సాధారణ టికెట్ రేటు 100 రూపాయలే అయితే, దీనిని 300 రూపాయల వరకు పెంచే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇది మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోల చిత్రాల రేట్ల కంటే 25 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టాక్.
పుష్ప-2 సినిమా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు 250 కోట్ల రూపాయలుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి-2 మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన రికార్డును దాటించడమే ఈ యూనిట్ ముందున్న బెంచ్‌మార్క్. మొదటి వారం టికెట్ రేట్లు అధికంగా ఉంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం తేలిక అవుతుందని యూనిట్ భావిస్తోంది.
ఇక రేట్ల పెంపు మాత్రమే కాకుండా ప్రీ రిలీజ్ ప్రమోషన్లతో కూడా భారీ హైప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ట్రైలర్, పాటల ద్వారా ప్రేక్షకులలో ఆసక్తిని పెంచిన యూనిట్, టికెట్ రేట్ల పెంపు ద్వారా మొదటి వారంలోనే కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు సన్నాహాలు చేస్తోంది. అల్లు అర్జున్ సొంత మార్కెట్, పుష్ప-1 ఇచ్చిన బ్లాక్‌బస్టర్ ఫలితం పుష్ప-2 పై భారీ అంచనాలను పెంచాయి. టికెట్ రేట్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుగుతుండగా, ఈ నిర్ణయం ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవేళ యూనిట్ పెట్టుకున్న లక్ష్యం నెరవేరితే, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను తిరగరాస్తారు.