నెపోటిజం ఈ పదం సినిమా రంగంలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. తమ సినిమా ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొన్న నటులకు తరచూ దానిపై ప్రశ్న ఎదురవుతుంటుంది. తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ దీనిపై స్పందించారు. ఎలాంటి సినీనేపథ్యం లేకుండా పరిశ్రమకు వచ్చిన రకుల్.. టాలీవుడ్, బాలీవుడ్‌లలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, తన కెరీర్‌లో నెపోటిజం కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు తాజాగా తెలిపారు.
ఏ విషయం గురించైనా నిర్మొహమాటంగా మాట్లాడే రకుల్.. బంధుప్రీతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పరిశ్రమలో నెపోటిజం ఉన్నమాట వాస్తవం. నేను దీని కారణంగా అవకాశాలు కోల్పోయాను. అవి నాకు దక్కలేదని బాధ పడలేదు. ఆ సినిమాలు నన్ను ఉద్దేశించినవి కాదని ముందుకుసాగాను. నా తండ్రి సైన్యంలో పనిచేసేవారు. ఆయన సలహాలు, అనుభవం నాకు ఎన్నో నేర్పాయి. చిన్నచిన్న వాటి గురించి ఆలోచించను. అవకాశాలు కోల్పోవడం జీవితంలో ఓ భాగం. నాకు దక్కని వాటి గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోను. ఏం చేస్తే నేను వ్యక్తిగతంగా ఎదుగుతానో దానిపై శ్రద్ధ పెడతాను. ఒక స్టార్ కిడ్‌కు లభించినంత సులభంగా మిగతా వారికి ఛాన్స్‌లు రావు. అదంతా వారి తల్లిదండ్రుల కష్టం’ అని రకుల్ వివరించారు.
ప్రస్తుతం అజయ్‌దేవగణ్ జంటగా రకుల్‌ప్రీత్ సింగ్ ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తున్నారు. విజయవంతమైన ‘దే దే ప్యార్ దే’కి కొనసాగింపుగా అన్షుల్ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు.