మహిళలకు ఇది చీకటి కాలం.. చట్టాలను మార్చాలంటున్న అనన్య పాండే!

ఇది మహిళలకు చీకటి కాలమని బాలీవుడ్‌ నటి అనన్యపాండే అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నటీమణులు వారి సమస్యలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారని అన్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతీ విషయం గురించి మహిళలకు అవగాహన ఉండాలి.

ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఇది మహిళలకు చీకటి కాలం. ఈ దాడులను ఆపడం కోసం ఏం చేయాలో ఆలోచించాలి. మన చుట్టూ ఉండే పరిసరాలను గమనించుకుంటూ ప్రతి వ్యక్తిపైనా అవగాహన కలిగిఉండాలి. నేను ఇలాంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంటాను. వాస్తవానికి చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చింది. ఇది చాలా అవసరమైన నిర్ణయం. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో అనన్య ‘లైగర్‌’ గురించి ప్రస్తావించారు. సినిమాల్లోని సన్నివేశాలపై హీరోయిన్లు ధైర్యంగా వారి అభిప్రాయాన్ని తెలపాలని అనన్య అన్నారు. ”నాకు ఏదైనా స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు అది బాగా లేదనిపిస్తే.. వెంటనే స్పందిస్తాను. ‘లైగర్‌’ స్క్రిప్ట్‌ చదివిన తర్వాత కొన్ని మార్పులు చెప్పాను. మరికొన్ని సన్నివేశాలు మార్చాలని సూచించాను. ఆ చిత్రబృందం నా సలహాలను పాటించింది. ఎంతో ఆనందంగా అనిపించింది. ఇలా అందరూ చెప్పగలగాలి’ అని వివరించారు.