రామునికి భారీ మొత్తంలో అందిస్తున్న “హనుమాన్” యూనిట్ 

తెలుగు సినిమా నుంచి లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “హనుమాన్” ర్యాంపేజ్ అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లోని ఇంకా హిందీ మార్కెట్ లో కూడా ఎక్కడా ఆగే సూచనలు కనిపించడంలేదు. యంగ్ హీరో తేజ సజ్జ తాను తన దర్శకుడు విషయంలో చెప్పిన మాట నిజం చేస్తూ ఈ సినిమా తన కెరీర్ లోనే ఒక బెంచ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది.

కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక భారీ వసూళ్లు వస్తాయని ముందే ఊహించారో ఏమో కానీ రిలీజ్ కి ముందే సినిమాకి తెగే ప్రతి టికెట్ లో 5 రూపాయలని అయోధ్య రామ మందిరంకి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఇక రేపు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ మందిరం లాంఛనంగా ఆరంభం అవుతుండగా.. 

ఇప్పుడు వరకు వచ్చిన వసూళ్ళలో తాము భారీ మొత్తంలో విరాళంగా ఆ రామునికి అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా ఇప్పుడు వరకు ఈ సినిమాకి ఇన్ని రోజుల్లో 53,28,211 తెగితే ఇందులో ప్రతి టికెట్ కి 5 రూపాయలు చొప్పున ₹2,66,41,055(అక్షరాలా రెండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై ఒక్కవేల యాభై ఐదు రూపాయలు) అందిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

కాగా ఆ శ్రీరాముని ఆశీస్సులతో తమ హనుమాన్ సినిమా సాధించిన అఖండ విజయానికి గాను తమ వంతు ఈ మొత్తం చిత్ర యూనిట్ ఇపుడు అందిస్తున్నారు. దీనితో ఈ వార్త విన్న సినిమా అభిమానులు రామ హనుమ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.