Gautam Gambhir: టీమిండియా భవిష్యత్తు కోసం గంబీర్ అడ్వాన్స్ ప్లాన్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

భారత క్రికెట్‌ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు ఏ కోచ్ చేయని ప్రయోగాన్ని చేస్తూ, యువ ఆటగాళ్లను దగ్గరుండి ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాడు. సీనియర్ జట్టును మాత్రమే పర్యవేక్షించే విధానానికి విరుద్ధంగా, ఇండియా ‘A’ జట్టుతో విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా యువ ఆటగాళ్ల ప్రతిభను ముందుగానే అంచనా వేసి, భవిష్యత్తులో టీమిండియాకు బలమైన బ్యాకప్‌ను సిద్ధం చేయాలని భావిస్తున్నాడు.

ఇప్పటి వరకు భారత ప్రధాన కోచ్‌లు రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రి వంటి వారు ఈ విధంగా యువ క్రికెటర్లతో కలిసి వెళ్లిన దాఖలాలు లేవు. అయితే గంభీర్ కొత్త మార్గాన్ని ఎంచుకుని, తన కోచింగ్ శైలిని విభిన్నంగా అమలు చేయాలని చూస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో, జట్టు ప్రణాళికలపై అతను మరింత దృష్టి పెట్టాడు. ఇండియా ‘A’ జట్టు టూర్లను పెంచాలని, తద్వారా యువ ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయాలని బీసీసీఐకి సలహా ఇచ్చినట్లు సమాచారం.

ఛాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ సూచించిన కొత్త ఆటగాళ్లు విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, అక్షర్ పటేల్‌ను మెరుగైన బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రోత్సహించడం మంచి ఫలితాలు ఇచ్చింది. దీంతో భవిష్యత్ టోర్నీలలోనూ అతని వ్యూహాలు టీమిండియాకు ఉపయోగపడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువ ఆటగాళ్ల సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా గమనించేందుకు గంభీర్ స్వయంగా ‘A’ జట్టుతో ప్రయాణం చేయడం, కోచింగ్‌ విధానంలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నారు.

గంభీర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, భారత క్రికెట్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయనేది చూడాలి. అతని ప్రణాళికలు విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర కోచ్‌లు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశముంది. టీమిండియాలో కొత్తదనాన్ని తీసుకురావడంలో గంభీర్ ఎంతవరకు విజయం సాధిస్తాడో వేచి చూడాల్సిందే!