బిర్యానీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. తరచూ తింటే మీ హార్ట్ ఫసక్..!

బిర్యానీ అంటే ఫుడ్ లవర్స్ పిచ్చి. చాలా మంది పండగ వేళ, పుట్టినరోజు వేడుక, పెళ్లిళ్లు, సెలవులు.. ఏ సందర్భమైనా బిర్యానీ లేకుండా సెలబ్రేట్ చేసుకోలేదు. ఇక హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే గల్లీ గల్లీకి ఒక బిర్యానీ హోటల్ కనిపిస్తుంటుంది. చక్కని రుచి, మసాలా సుగంధంతో వచ్చే మత్తు కారణంగా ఎంతో మంది బిర్యానీపై ప్రేమ చూపుతుంటారు. కానీ ఇదే బిర్యానీని తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదాలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిర్యానీలో ఎక్కువగా నెయ్యి, ఆయిల్, మసాలా పదార్థాలు, మాంసాహారపు ముక్కలు వంటివి కలుస్తాయి. వీటిలో కొవ్వులు, ముఖ్యంగా ట్రాన్స్‌ ఫ్యాట్లు అధికంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల రక్తనాళాలు మూసుకునే అవకాశం, హార్ట్ బ్లాక్‌లు, హార్ట్‌ ఎటాక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక బిర్యానీలో వాడే ఉప్పు పరిమితికి మించి ఉంటుంది. దీని వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరిగి హై బీపీ, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, తరచుగా ఈ వంటకాన్ని తినడం వల్ల బరువు పెరగడం, షుగర్ లెవెల్స్‌ పెరగడం, అకాల వృద్ధాప్యం వంటి సమస్యలు కూడా దాపురించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వారానికి ఒకసారి బిర్యానీ తినడంలో పెద్ద నష్టం ఏమీ ఉండదు. అయితే దీన్ని అలవాటుగా మార్చుకుంటే మాత్రం శరీరంపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్, తక్కువ శ్రమతో ఎక్కువ రుచి ఇవ్వే వంటకాలను ఎక్కువగా తినే అలవాటు వదలుకోవాలని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు ఎంపికలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. సందర్భం బట్టి ఒక్కోసారి బిర్యానీ తినడంలో తప్పు లేదు కానీ, పరిమితి పాటించకపోతే… రుచి నిమిత్తం ఆరోగ్యాన్ని కోల్పోయే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని ఆచరించే ముందు వైద్యుల సలహా తీసుకోండి.)