ఓ పది టిక్కెట్లు ఫ్రీగా ఇచ్చేస్తే ఏం పోతుంది.? కేవలం పది టిక్కెట్లు అయితే నిర్మాతకి పోయేదేమీ వుండదు. డిస్ట్రిబ్యూటర్ కూడా పెద్దగా పట్టించుకోరేమో.! కానీ, విషయం వేరేలా వుందిక్కడ.
సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య సినీ జర్నలిస్టులు, సినీ మీడియా సంస్థలూ (మరీ ముఖ్యంగా వెబ్ సైట్లు) సినీ అభిమానులకి టిక్కెట్లు పంచేస్తుండడం చూస్తున్నాం. పది టిక్కెట్లు, పాతిక టిక్కెట్లు, వంద టిక్కెట్లు కూడా పంచేస్తుండడం గమనార్హం.
మొదట్లో ఆయా మీడియా సంస్థలు లేదా, సినీ జర్నలిస్టులు తమ ఫాలోయింగ్ పెంచుకోవడానికి, ఈ ప్రయోగానికి తెరలేపారు. ఆ ప్రయోగాలకి నిర్మాతల నుంచి సహాయ సహకారాలు లభించాయి.
క్రమంగా విషయం ముదిరి పాకాన పడింది. వందల్లో టిక్కెట్లను ఇలా ఉచితంగా ఇచ్చేయాల్సిన పరిస్థితి రావడంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారట. నిర్మాతల మీద బ్లాక్‌మెయిలింగ్ కూడా పెరిగిందట ఇప్పుడీ టిక్కెట్ల లొల్లి పుణ్యమా అని.
బ్లాక్‌మెయిల్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అయిన కొందరు, నిర్మాతల్ని పీడించుకు తింటున్నారంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా, ఫ్రీ టిక్కెట్లు ఇస్తే సినిమాలు హిట్టయిపోతాయని చెప్పిందెవడు.? సోకాల్డ్ నిర్మాతలెలా ఈ బూటకపు మాటల్ని నమ్మారు.?
ప్రీమియర్స్ ట్రెండ్ కొత్తగా మారాక, ఈ టిక్కెట్ల పైత్యం మరింత పెరిగిపోయింది. ఈ మాఫియాకి అడ్డుకట్ట వేయాలంటూ సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోందట. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు?