Rice: పోషకాహార లోపాలకు పరిష్కారం.. ఈ అన్నం తింటే రోగాలు మాయం..!

మన దేశంలోని చాలా మంది రోజూ అన్నాన్నే తింటుంటారు.. దాదాపుగా ప్రతిఒక్కరి ఆహారంలో అన్నం తప్పనిసరిగా ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తారు. ఇక అన్నం లేకుండా భోజనం అసంపూర్ణమని అనుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి బియ్యంలో ఇప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే మార్పులు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఫోర్టిఫైడ్ రైస్. ఇది సాధారణ బియ్యాన్ని మించిన ప్రయోజనాలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఫోర్టిఫైడ్ రైస్ అంటే, పాలిష్ చేసిన సాధారణ బియ్యంలో లేకపోయే కొన్ని ముఖ్యమైన పోషకాలను అదనంగా కలిపిన ప్రత్యేక బియ్యం. ఇందులో ముఖ్యంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 లాంటి పోషకాలు ఉంటాయి. వీటితో పాటు కొన్ని రకాల మినరల్స్, గింజల వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఆహార నిపుణురాల ప్రకారం.. ఒక కిలో ఫోర్టిఫైడ్ రైస్‌లో సుమారు 28 నుండి 42 మిల్లీగ్రాముల ఐరన్, 72 నుండి 120 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ చేర్చే అవకాశం ఉంటుంది.

ఈ పోషకాలన్నీ సాధారణ బియ్యంలో ఉండవు. అందుకే, వాటిని ఇలా అదనంగా కలిపినప్పుడు మన శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా విటమిన్ B12 లోపం, ఐరన్ లోపం ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. పోషకాహార లోపాలను తగ్గించేందుకు ఫోర్టిఫైడ్ రైస్‌ మంచి పరిష్కారంగా నిలుస్తోంది. దీన్ని సాధారణ బియ్యం మాదిరిగానే వండి తినవచ్చు. రుచి, వాసనలో పెద్ద తేడా ఉండదు. అయితే దీని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎంతో కీలకంగా మారుతున్నాయి.

వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నవారికి ఇది మరింత ఉపయోగపడుతుంది. పోషకాహార లోపాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఆరోగ్యంగా జీవించాలనే వారికి దారి చూపించే మార్గంలా మారుతోంది.