హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని పార్క్ హయత్ స్టార్ హోటల్లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం కలకలం రేపింది. హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో అక్కడ ఉన్న గెస్టులు, హోటల్ సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎక్కువగా ఉండటంతో దట్టమైన పొగలతో హోటల్ అంతా కమ్ముకుంది.
హోటల్ యాజమాన్యం అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. కొన్ని నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది హోటల్‌కి చేరుకుని మూడు ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు పెద్ద స్థాయిలో వ్యాపించకముందే వాటిని ఆర్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో హోటల్ ఆరో అంతస్తులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) క్రికెట్ జట్టు ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ బసచేస్తుండటం కలవరం రేపింది.
ఘటన జరిగిన వెంటనే జట్టు మేనేజ్‌మెంట్ స్పందించి ఆటగాళ్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకెళ్లింది. వీరిని బస్సులో వేరే సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ ఐపీఎల్ 2025 సీజన్ కోసం SRH జట్టు గత కొన్ని రోజులుగా అదే హోటల్‌లో బస చేస్తోంది. మంటలు ఎక్కువ అవకముందే జాగ్రత్తలు తీసుకోవడంతో ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ప్లేయర్లు బయటపడ్డారు.
ప్రస్తుతం SRH జట్టు సభ్యులు ఇతర హోటల్‌కి షిఫ్ట్ అయ్యారు. బంజారాహిల్స్ ఫైర్ సిబ్బంది మంటల ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్లేయర్లకు ఏమి కాలేదు అన్నది అందరికీ ఊరట కలిగిస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో హైదరాబాద్ వాసులు కూడా షాక్‌కు గురయ్యారు.