అందరి ఫోకస్ సంక్రాంతి పైనే..?

సంక్రాంతి ఫెస్టివల్ అంటే టాలీవుడ్ నిర్మాతలకి పెద్ద పండగ లాంటిది. ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు చాలా మంది నిర్మాతలు దర్శకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తే కూడా కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ అందుకోవచ్చని అంచనా వేస్తూ ఉంటారు.

చాలా సినిమాలు యావరేజ్ కంటెంట్ తోనే సంక్రాంతి రేసులో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇలా ఉంటే 2024 సంక్రాంతి రేసులో కూడా చాలా సినిమాలు పోటీ పడుతూ ఉన్నాయి. సంక్రాంతి రేస్ లో పోటీ పడబోయే చిత్రాల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె జనవరి 12న రిలీజ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అలాగే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ కూడా సంక్రాంతి రేసులోనే పోటీపడుతుంది. హరిశంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తానని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కింగ్ నాగార్జున, ప్రసన్నకుమార్ దర్శకత్వంలో చేయబోయే 99వ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను దర్శకత్వంలో చేస్తున్న సైంధవ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ 62వ సినిమా కూడా సంక్రాంతి రేసులోనే పోటీ పడబోతుంది.

మొత్తానికి ఈ జాబితా చూసుకుంటే ప్రస్తుతానికి చాలా పెద్దగానే కనిపిస్తుంది. అలాగే ఈ రేసులో పోటీలో ఉన్న సినిమాలన్ని కూడా స్టార్ హీరోల చిత్రాలే కావడం విశేషం. మరి వీరిలో ఎవరైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా అనేది చూడాలి. అలాగే ఈ పోటీలోకి ఇంకా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.