Edgbaston: ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర.. ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం..!

ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఇంతవరకు గెలవలేని టీమిండియా జట్టు.. ఈసారి ఆ చరిత్రను మార్చేసింది. ఇంగ్లాండ్‌ను వారి సొంత మైదానంలో చిత్తుగా ఓడించి, 337 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో.. భారత్ కీ రోల్ ఆడింది కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ డబుల్ సెంచరీతో, ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ ముందు భారీ టార్గెట్ ఉంచింది. గిల్ డబుల్ సెంచరీతో అద్భుతంగా రాణించగా.. ఇతర ఆటగాళ్లు కూడా చక్కగా రాణించడంతో భారీ స్కోర్ చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. అప్పటికే 180 పరుగుల ఆధిక్యం పొందిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో మరింత దూకుడు చూపించి 427/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఇంతటి భారీ లక్ష్యం ముందు ఇంగ్లాండ్ మరోసారి తలెత్తలేకపోయింది. 608 పరుగుల ప్రపంచ రికార్డు ఛేదించాలని వచ్చిన ఇంగ్లాండ్, ఆకాశ్ దీప్ బౌలింగ్ ధాటికి చిత్తుగా కుప్పకూలింది. 6 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు. సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసి మద్దతుగా నిలిచారు.
తుదకు ఇంగ్లాండ్ 271 పరుగులకే ఆలౌట్ అయ్యి చేతులు ఎత్తేయాల్సి వచ్చింది.

ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. తొలిసారిగా ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచిన ఆసియా జట్టు కావడం గర్వకారణం. పైగా తొమ్మిది ప్రయత్నాల్లో ఇంతవరకు సాధించలేని విజయాన్ని యువ భారత్ సాధించింది. అదనంగా, ఆకాశ్ దీప్ 10 వికెట్లు తీసి విదేశీ బౌలర్‌గా అద్భుతమైన రికార్డు నమోదు చేశాడు. ఈ గెలుపుతో మొదటి టెస్టులో ఓటమికి పటిష్ట ప్రతీకారం తీర్చుకున్నట్లు టీమిండియా అభిమానులు భావిస్తున్నారు.