దిశ ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. యువ మహిళా డాక్టర్ ని జాతీయ రహదారిపై మాటేసి హత్యాచారం చేసిన మాస్ లారీ గ్యాంగ్ ఉదంతం ఓ సంచలనం. అత్యంత పాశవికంగా అత్యాచారం..అటుపై హత్యకు దారి తీసిన పరిస్థితులు ఓ సినిమా కథనే తలపించాయి. జాతీయ రహదారిపై రెక్కి వేయడం…నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయడం.. ఈ కేసును చేధించడంలో సీ.పీ సజ్జనార్ ఆపరేషన్..ఎన్ కౌంటర్ ఇలా ప్రతీది ఓక్రైమ్ థ్రిల్లర్ నే తలపిస్తుంది. అందుకే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ ఉదంతాన్ని కథా వస్తువుగా మలుచుకుని `దిశ` టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
స్క్రిప్ట్ కి సంబంధించి తానే స్వయంగా రంగంలోకి దిగి ఎన్ కౌంటర్ బాధితుల కుటుంబాల నుంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి కమర్శియల్ హంగులు దిద్ది వదులుతున్నాడు. బాధితుల కోణం నుంచి ఈ కథ ప్రారంభం అవుతుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. వర్మ స్క్రిప్టును ఆ రకంగానే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆద్యంతం ఆసక్తికరంగా వర్మ శైలిలో ట్రైలర్ అదిరిపోయింది. నవంబర్ 26 సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు జాము వరకూ జరిగిన సన్నివేశాల్ని కళ్లకు కట్టారు.
ఘటన తర్వాత పోలీసుల ఎంట్రీ. సెర్చ్ ఆపరేషన్ లో పోలీసుల వాడిన టెక్నాలజీ అన్నింటిని ట్రైలర్ లో రివీల్ చేసారు. తెలిసిన ఉదంతం కావడంతో ట్రైలర్ లోనే కథ మొత్తాన్ని రివీల్ చేసారు. పాత్రలన్ని వాస్తవ పాత్రలకు చాలా దగ్గరగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ఆర్ ఆర్ వర్మ టేస్ట్ కి ఎంత మాత్రం తగ్గలేదు. సినిమాటోగ్రఫీ..నైట్ మోడ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఈ చిత్రాన్ని వర్మ శిష్యుడు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. డి.ఎస్ . ఆర్ సంగీతం అందిస్తున్నారు. నట్టి క్రాంతి- నట్టి కరుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.