బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై ‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ‘కల్కి’ సినిమాలో ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేసిన నెటిజన్.. ఈ ఒక్క సీన్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంతో సమానం అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్‌పై నాగ్‌అశ్విన్ స్పందిస్తూ.. టాలీవుడ్, బాలీవుడ్ అని విడదీసి మాట్లాడొద్దన్నారు. ’నార్త్-సౌత్, టాలీవుడ్ వెర్సస్ బాలీవుడ్.. ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. మనమందరం ఒక ఇండస్ట్రీకి చెందినవాళ్లమే. అర్షద్ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది. అయినా ఫర్వాలేదు. మేము అతడి పిల్లల కోసం ‘కల్కి’ బుజ్జి బొమ్మలు పంపిస్తాం. ‘కల్కి’ రెండోభాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తాను.
అందులో ప్రభాస్‌ను బెస్ట్‌గా చూపిస్తాను అని రాసుకొచ్చారు. ప్రపంచంలో చాలామంది మనల్ని ద్వేషిస్తారు. కానీ, మనం వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలి అని నాగ్‌అశ్విన్ చెప్పారు. ప్రభాస్ కూడా ఇదే మాట అంటుంటారని ఆయన తెలిపారు. మరోవైపు ప్రభాస్‌పై అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం గా మారుతున్నాయి.
వీటిని ఖండిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ విూడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ అంశంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు బాలీవుడ్ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. అభిప్రాయాల్ని వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, అర్షద్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్‌ని తక్కువ చేసేలా, వ్యతిరేకతకు కారణమయ్యేలా ఉన్నాయి.
భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయనకు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాం. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా నటీనటులంతా గౌరవంగా ఉండాలని కోరుతున్నాం. మనమంతా ఒకే కుటుంబంలో భాగమని గుర్తుంచుకోవాలి. ఈ ఐక్యతని కాపాడుకుందాం అంటూ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్‌కు రాసిన లేఖలో విష్ణు పేర్కొన్నారు.