అసలు కథంతా ముందున్నది.. ‘కల్కి’ సీక్వెల్‌పై నాగ్‌ అశ్విన్‌ వ్యాఖ్య!

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిర్మాత పలు సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు. తాజాగా మొదటిసారి నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి’ సీక్వెల్‌పై స్పందించారు. అసలు కథ మొదలయ్యేది పార్ట్‌2లోనే అంటూ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సీక్వెల్‌కు సంబంధించి నెలరోజుల షూటింగ్‌ చేశాం. దానిలో 20శాతం బెస్ట్‌గా వచ్చింది. ఇంకా ముఖ్యమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. వాటిని కొత్తగా ప్రారంభించాలి.

ఈ సీక్వెల్‌లో కమల్‌ హాసన్‌, ప్రభాస్‌ , అమితాబ్‌ మధ్య భారీ యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలకం కానుందని అన్నారు. యాస్కిన్‌ పాత్రకు సీక్వెల్‌లో నిడివి ఎక్కువ ఉంటుందని ఇటీవల కమల్‌ కూడా చెప్పారు. దీంతో ‘కల్కి2’పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు వస్తోన్న ఆదరణపై నాగ్‌ అశ్విన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

’ప్రేక్షకులు దీన్ని ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎంతోమంది ఆడియన్స్‌ ఒకసారి కంటే ఎక్కువసార్లు దీన్ని వీక్షిస్తున్నారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి అదే సంకేతం’ అంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కల్కి’ కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రూ.700కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ఈ సైన్స్‌ ఫిక్షన్‌ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టు కున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ్గªటైర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ కామెంట్స్‌తో అవి రెట్టింపయ్యాయి.