ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ’కల్కి 2898ఏడి’ సినిమా గత వారం విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది అనే చెప్పాలి. ఇందులో బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్, ఇంకొక లెజండరీ నటుడు కమల్ హాసన్ కూడా వున్నారు. ఇప్పుడు విడుదలయింది మొదటి పార్టు అని, రెండో పార్టు ఇంకో మూడు సంవత్సరాల తరువాత విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాలో ప్రభాస్ పాత్ర నిడివి చాలా తక్కువయిందని టాక్ వినిపించింది అన్న సమాధానానికి దర్శకుడు రెండో పార్టులో ఎక్కువ ఉంటుంది అని చెప్పారు.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి చాలామంది ప్రేక్షకులకి అర్థం కాలేదు. సినిమా కూడా చాలా నెమ్మదిగా సాగుతూ ఉండటంతో ప్రేక్షకులకి కొంచెం బోర్ కూడా కొట్టింది అనే వార్తలు వినిపించాయి. అదే విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఒప్పుకున్నారు. కాంప్లెక్స్‌లో సన్నివేశాలని కొంచెం వేరేగా చూపిస్తే నిడివి తగ్గి ఉండేదని చెప్పారు.
ఆ విమర్శని నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను అని చెప్పారు నాగ్ అశ్విన్. అలాగే సినిమా అయ్యాక డబ్బింగ్ కూడా బాగోలేదని సామాజిక మాధ్యమాల్లో బాగా విమర్శలు వచ్చాయి. దానికి నాగ్ అశ్విన్ కూడా డబ్బింగ్ అనుకున్నంత సరిగ్గా రాలేదని ఒప్పుకున్నారు. ఆ పాత్ర వేసినవాళ్ళే డబ్బింగ్ చెపితే బాగుంటుంది అని చెప్పించాం, కానీ అది పట్టినట్టు ఉందని తరువాత అర్థం అయింది అని నాగ్ అశ్విన్ చెప్పారు. నేపధ్య సంగీతం గురించి మాట్లాడుతూ కూడా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని సన్నివేశాల్లో ఇంకా కొంచెం బాగుంటే బాగుండేది అనే ఫీలింగ్ తనకి కూడా వచ్చింది అని నాగ్ అశ్విన్ అన్నారు.