Fauji: ప్రభాస్ ఫౌజి కథ.. అసలు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

‘సీతారామం’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత హను రాఘవపూడి డార్లింగ్ ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా రెండవ ప్రపంచ యుద్ధం నాటి కథతో రూపొందుతున్న ఫిక్షనల్ ప్రేమకథ అని టాక్ ఉంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో పలు రూమర్లు వచ్చాయి. హను గతంలో నాని కోసం రాసుకున్న కథతోనే ఈ సినిమా చేస్తున్నారు అని టాక్ వచ్చింది. అయితే, దర్శకుడు హను ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. నాని కోసం రాసిన కథ కాకుండా, ఈ ప్రాజెక్ట్ కోసం సరికొత్త కథ సిద్ధం చేశానని తెలిపారు. ప్రత్యేకంగా ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ కథ రాసినట్లు వెల్లడించారు. ఈ సినిమాతో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లడం తన లక్ష్యమని, ఇప్పటి వరకు టచ్ చేయని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని అన్నారు.

ఈ సినిమాలో కొత్త నటి ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఆమెకు ఇది తొలి సినిమా. దర్శకుడు హను రాఘవపూడి ఆడిషన్స్ నిర్వహించి ఆమెను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇమాన్వి మీద కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ త్వరలో షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.

‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వచ్చినా, ఇంకా అధికారిక ప్రకటన లేదు. అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో విజువల్ ట్రీట్‌గా ఉండబోతోంది.

రాజీనామా రహస్యం || Dasari Vignan Analysis on Vijay Sai Reddy Resignation || Ys Jagan || TeluguRajyam