Deepika Padukune: ఎన్టీఆర్‌తో కలిసి నటించాలనుందన్న దీపికా పదుకునే…ఆ విషయం అప్పుడే వెల్లడించిన పాయల్!

Deepika Padukune: టాలీవుడ్ స్థాయి రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. ఇప్పుడు అన్ని సినీ ఇండస్ట్రీలు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీవైపే చూస్తున్నాయనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. అది బాహుబలి సినిమా తర్వాత మరింత ఎక్కువైంది. బాలీవుడ్‌లో మనకు గౌరవం దక్కలేదనే స్థాయి నుంచి టాలీవుడ్ సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలు సైతం వాయిదా వేసుకునే స్థాయికి వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు టాలీవుడ్‌ సాధించిన ఘనత.

ఇకపోతే ఈ మధ్య కాలంలో వచ్చే తెలుగు అగ్ర హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం చెప్పుకోదగిన అంశం. అయితే అలాంటి స్టార్ నటుల సరసన ఒక్క సినిమాలోనైనా నటించేందుకు అవకాశం ఎప్పుడొస్తుందా అని ఇప్పుడు బాలీవుడ్ కథానాయికలు సైతం తహతహలాడుతున్నారు. తాజాగా దీపికా ప‌దుకొనే కూడా త‌న మ‌నుసులో మాటను బ‌య‌పెట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచింది.

టాలీవుడ్‌లో యంగ్ ఎన్టీఆర్‌కు ఏ స్థాయిలో ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బాలీవుడ్‌లోనూ తన సత్తా నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా విడుదల కాకముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఎన్టీఆర్‌కు ఫుల్‌ క్రేజ్ వచ్చేసింది.

అయితే ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ స్టార్ట్ ఎన్టీఆర్‌ను పొగుడుతూ కామెంట్స్ చేయగా, ప్రస్తుతం దీపికా పదుకునే కూడా తన మనసులోని మాటను తెలియజేసింది. ఎన్టీఆర్‌ యాక్టింగ్ స్కిల్స్ తనకు బాగా నచ్చుతాయన్న ఆమె, ఆయనతో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నానంటూ వ్యాఖ్యానించింది. తెలుగులో మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లపైనే ఇప్పుడు తన ఫోకసంతా అని ఆమె తన నిర్ణయాన్ని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పాయల్, బాలీవుడ్‌ హీరోయిన్లు ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం తాను ఇంతకు మునుపే చెప్పానని, తాను ఇప్పటికే ఎన్టీఆర్‌తో నటించడం వల్ల తనకు చాలా సంతోషంగా, గర్వంగానూ ఉందని ఆమె చెప్పుకొచ్చింది. తాను అప్పుడలా చెప్పినపుడు చాలా మంది తనను విమర్శించారన్న పాయల్, త్వరలోనే సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్‌ను కైవసం చేసుకుంటుందని అమె స్పష్టం చేసింది.