ప్రస్తుతం దేశంలో అత్యాచార ఘటనలు జరగని రోజంటూ ఉండదు. ఇక సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అత్యాచార బెదిరింపులకు అయితే కొదవే ఉండవు. అవన్నీ ఎలా ఉన్నా ధోని సరిగా అడనంత మాత్రానా అతని కూతురు జీవాపై ఇష్టమొచ్చినట్టుగా అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ 13వ సీజన్ లో 6 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
చెన్నై చివరగా కోల్‌కత నైట్ రైడర్స్ తో తలపడి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ ఓటమి తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ధోనిని, అతని కుటుంబాన్ని కించపరుస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అందులో మరి కొంతమంది ధోని ఐదేళ్ల కూతురు జీవాపై అత్యాచార బెదిరింపులకు పాల్పడుతునారు. అలాంటి పోస్ట్‌లపై అందరూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిన్మయి స్పందిస్తూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.
ఓ క్రికెట్ ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే అతని ఐదేళ్ల కూతురిపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదే మన దేశ సంస్కృతిని చాటిచెబుతోంది. మన పోలీసులు, ప్రభుత్వాలు అలాంటి వారిని కట్టడి చేయకపోతే.. శిక్షించకపోతే.. అవే ఎన్నో దారుణాలకు కారణమవుతాయి. చివరకు ఇదే మనకు చాలా కఠినమైన పరిస్థితులను తీసుకొస్తుందని చిన్మయి మండిపడింది.