ఛత్తీస్‌గఢ్ మరోసారి రక్తమోడింది. గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది గస్తీ తిరుగుతుండగా మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో ఘర్షణలు చెలరేగాయి. గంటల తరబడి కొనసాగిన ఈ ఫైరింగ్‌లో ఇప్పటి వరకు పది మంది మావోయిస్టులు మృతి చెందిఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో భద్రతా దళాలు భారీ స్థాయిలో కాంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఈ ఘటనను ధ్రువీకరించారు. గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మావోయిస్టులు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెబుతున్నారు. పోలీసులు క్షేమంగా బయటపడ్డారని. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి అని ఆయన ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లు కలిసి మోహరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, అదే రోజున దంతేవాడ జిల్లా మరోసారి మావోయిస్టుల దుష్టచర్యలకు వేదిక అయింది. మందుపాతరలను నిర్వీర్యం చేయడానికి వెళ్ళిన సీఆర్పీఎఫ్ సిబ్బందిపై మావోయిస్టులు బలమైన ఐఈడీ పేలుడు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి . గాయపడిన సిబ్బందిని తొలుత దంతేవాడ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు హెలికాప్టర్ ద్వారా తరలించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల.. భద్రతా బలగాలు క్రమం తప్పకుండా ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో గరియాబంద్, దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల్లో తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. అధికారుల అంచనా ప్రకారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఇంకా బలంగా గూడు కట్టుకుని ఉన్నారని, వీరిని నిర్మూలించే క్రమంలో మరిన్ని ఆపరేషన్లు కొనసాగుతాయని సమాచారం.
