Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగులు కత్తితో దాడి చేసిన ఘటన ముంబైని కలిచివేసింది. ఈ ఘటన బాంద్రాలోని సైఫ్ నివాసంలో నిన్న రాత్రి చోటుచేసుకుంది. దాడి సమయంలో సైఫ్‌తో పాటు ఆయన భార్య కరీనా కపూర్, పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు సైఫ్‌పై కత్తితో దాడి చేయడంతో పాటు, అడ్డుకున్న కేర్ టేకర్‌పై కూడా హింసకు పాల్పడ్డారు.
వార్తల ప్రకారం, దుండగులు దాడికి ముందు రోజు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ఒక వ్యక్తి మాత్రమే దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ ఇంట్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించారన్న వార్తలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి కారణంగా సైఫ్ వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతడిని ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నితిన్ దంగే వెల్లడించిన వివరాల ప్రకారం, కత్తి పోట్ల వల్ల సైఫ్ వెన్నులో స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అయింది. వెన్నులో ఇరుక్కుపోయిన కత్తి ముక్కను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్ ఎడమ చేతికి రెండు, మెడకు ఒకటి లోతైన గాయాలు అయ్యాయి. ప్లాస్టిక్ సర్జరీలతో గాయాలను శరీరంలో మళ్లీ పునరుద్ధరించారని వైద్యులు తెలిపారు.
సైఫ్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు ప్రకటించారు. మరింత చికిత్స అనంతరం 100 శాతం కోలుకునే అవకాశం ఉందని వారు ధృవీకరించారు. సైఫ్ గాయపడ్డ విషయం తెలియగానే అభిమానులు, సహచరులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో సందేశాలు పంపిస్తున్నారు. ఈ దాడి ఘటన బాలీవుడ్‌ను తీవ్రంగా కలవరపెట్టింది.
పోలీసులు దుండగులపై విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ దాడి వెనుక అసలు కారణాలను పరిశీలిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెలుగులోకి రానున్నాయి.