సినిమాకి, రాజకీయానికి దగ్గర సంబంధం ఉంటుంది. మూవీ ఇండస్ట్రీలో నటులుగా సక్సెస్ అయిన వారు తరువాత ఆ ఫేమ్ తో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అవుతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొంతమంది తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో సినిమానే రాజకీయం అనేంతలా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో అన్న ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాలతో బంధం పెట్టుకొని ఉన్నారు. తెలంగాణలో విజయశాంతి బీజేపీ ప్రధాన లీడర్ గా ఉన్నారు. రోజా మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే చాలా మంది సినీ నటులు రాజకీయాలలో రాణిస్తున్నారు. తమిళనాడులో అయితే జయలలిత, కరుణానిధి, విజయ్ కాంత్, శరత్ బాబు, కమల్ హాసన్ ఇలా ప్రస్థానం కొనసాగుతోనే ఉంది.
ఇప్పుడు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కె సుధాకర్ తరుపున బ్రహ్మానందం ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఆరోగ్యమంత్రిగా కె సుధాకర్ పని చేశారు. తారకరత్న బెంగుళూరు హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఆయన దగ్గరుండి అన్ని చూసుకున్నారు.
తద్వారా తెలుగు ప్రజలకి సుధాకర్ చేరువ అయ్యారు. చిక్ బుల్లాపూర్ నుంచి ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో బ్రహ్మానందం ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విశేషం. బీజేపీ కండువా వేసుకొని కె సుధాకర్ ని గెలిపించాలని బ్రహ్మానందం కోరారు. ఆయన ఎంత మంచి వ్యక్తో అందరికి తెలుసని అన్నారు. అందుకే సుధాకర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలని కోరారు.
ఈ ఎన్నికల ప్రచారం కేవలం కె సుధాకర్ కోసమే బ్రహ్మానందం చేసారా లేదంటే బీజేపీ పార్టీ మీద ఉన్న అభిమానంతో చేసారా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ బీజేపీ పార్టీకి సపోర్టర్ గా ఉంటే మాత్రం 2024 ఎన్నికలలో ఏపీలో బ్రహ్మానందాన్ని బీజేపీ ఎన్నికల కోసం ఉపయోగించుకునే ఛాన్స్ ఉండనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.