Boney Kapoor: దక్షిణాది సినిమాలపై బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు… ఏమన్నారంటే

Boney Kapoor: ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత బోనీకపూర్ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా బాలీవుడే అని అనుకునే రోజులు పోయాయని ఆయన తెలిపారు. తెలుగు సినిమాలతో పోలిస్తే హిందీ సినిమాల్లో అంత చెప్పుకునే రీతిలో కంటెంట్ ఉండడం లేదని, ఒక రకంగా చెప్పాలంటే అంత ఆసక్తికరంగా ఉండడం లేవని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో బాలీవుడ్‌ సినిమాలకు ఇప్పటివరకున్నటువంటి ప్రాధాన్యత రోజురోజుకీ తగ్గిపోతూ వస్తోందని ఆయన చెప్పారు.

ఒకప్పుడు భారీ బడ్జెట్ మూవీస్‌ అంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపించేవి. హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ కూడా వారికే ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత విషయానికొస్తే తెలుగు డైరెక్టర్లూ ఒకటికి పది అడుగులు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ నిర్మాతలు సైతం పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో తెలుగు సినీ పరిశ్రమ కూడా బాలీవుడ్‌కు పోటీ పడే స్థాయికి ఎదుగుతున్న క్రమంలో బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూస‌ర్ బోనీ కపూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

ఇకపోతే థియేటర్ల ఓనర్లు విపత్కర పరిస్థితులను చవి చూస్తోన్న ఈ సమయంలో తెలుగు సినిమా ఓటీటీ ద్వారా వారికి ప్రోత్సాహాన్నందిస్తుందని ఆయన కొనియాడారు. ఇక తమిళ సినిమాలు డబ్బింగ్ వెర్షన్‌లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది సినిమాలే నిజమైన భారతీయ సినిమా తీస్తున్నట్టు అర్థమవుతోందని సౌతిండియన్ సినిమాపై తన అభిప్రాయాన్ని, ప్రశంసనలను కురిపించారు బోనీ కపూర్.