బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్.. ఆస్తుల సంపాదన చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన బాలీవుడ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్‌ ఒకరు. 2011లో ప్యార్ కే పంచనామా సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తీక్ సిల్ వత్, సోనుకి టిటుకీ స్వీటీ, లుకా చప్పి, పతి పత్నీ ఔర్ ఓ, లవ్ ఆజ్ కల్, ధమాకా వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. ఇక 2022లో భూల్ భూలయ్యాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

కాగా 2022లో బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో భూల్ భూలయ్యా- 2 ​‍అగ్రస్థానంలో నిలిచింది. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో ఏకంగా రూ. 4.72 కోట్ల విలువైన మెక్‌లారెన్ కారును బహుమతిగా అందుకున్నాడు కార్తీక్ ఆర్యన్. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన కార్తీక్ ఆర్యన్‌కు పెట్టుబడులపై చాలా నమ్మకం ఉంది. ప్రతి సినిమా తర్వాత తన రెమ్యునరేషన్‌లో భారీ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ లేదా మరేదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకున్నాడు.

ఈ మధ్య కాలంలో కార్తీక్ ఆర్యన్ తన రెమ్యునరేషన్ పెరగడంతో దానికి తగ్గట్టుగానే తన పెట్టుబడులను ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో పెడుతున్నాడు. కొన్ని నెలల క్రితం ఇదే ముంబైలోని జుహు ప్రాంతంలో రెండు పెద్ద ఆస్తులను కొనుగోలు చేశాడు. ఆ రెండింటీకి రూ.17 కోట్లు చెల్లించాడు. ఆ రెండు ఆస్తులను అద్దెకు ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం కార్తీక్ జుహులోని ఒక ఆస్తి నుండి నెలకు రూ.4.50 లక్షలు పొందుతున్నాడు. అంధేరిలో రెండు ప్రాపర్టీలను కొనుగోలు చేశాడు. ఇది ముంబైలోని ప్రధాన ప్రాంతం కావటం గమనార్హం!

ఒకటి రెసిడెన్షియల్ ప్రాపర్టీ, మరొకటి కమర్షియల్ ప్రాపర్టీ. ఈ రెండు ఆస్తులపై మొత్తం రూ.42 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భూలయ్య 3’ నెల రోజుల క్రితం విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.దీంతో ప్రస్తుతం అతని పారితోషికం రూ.50 కోట్ల కు చేరుకుంది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అతను ఆర్థిక వనరులను సమకూర్చుకునే విధానం నిజంగా అభినందించ వలసిందే.