Bhairavam: భైరవం బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

టాలీవుడ్‌లో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్న మంచు మనోజ్, ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి నేరుగా మాస్ యాక్షన్ జోనర్ ఎంచుకుని, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌లతో కలిసి మల్టీస్టారర్ ట్రై చేశాడు. మే 30న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా, కేవలం రీమేక్ అనిపించకుండా మేకర్స్ కొత్త కంటెంట్‌ను జోడించారంటూ ప్రమోషన్లలో చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది మాత్రం సినిమా బిజినెస్ వివరాలే.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘భైరవం’ మూవీ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలో దాదాపు రూ. 50 నుంచి 55 కోట్ల మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇందులో ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కులు కూడా ఉన్నాయి. జీ గ్రూప్ ఈ హక్కుల్ని భారీ ధరకు దక్కించుకోవడం గమనార్హం. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఉన్న రెచ్‌కు జీ ఎక్కువ కోట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు కావాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే టాక్ ఎక్కడికి తీసుకెళ్తుందన్నది క్లారిటీగా తేలాలి. మే 30న పెద్దగా పోటీ లేకపోవడంతో ఓపెనింగ్స్ డీసెంట్‌గా వస్తాయని అంచనాలు ఉన్నాయి. అయితే జూన్ 1న థియేటర్ల బంద్ జరిగితే వసూళ్లపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది.

పవన్ కళ్యాణ్ సినిమా జూన్ 12 వరకు లేట్ కావడంతో మధ్య గ్యాప్‌ను భైరవం టీమ్ వాడుకోవాలని భావిస్తోంది. విజయ్ కనకమేడల గత చిత్రం ‘ఉగ్రం’ ఫెయిలయ్యిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ పైన మరింత జాగ్రత్తగా దృష్టి పెట్టారట. మొదటి వారం టాక్‌ను బట్టి ఈ మూవీ లాభాల బాటలో నడుస్తుందా? అనేదే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ప్రధాన చర్చ.