భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తాత్కాలిక సద్దుమణికి గ్రీన్ సిగ్నల్ పడటంతో, బీసీసీఐ మళ్లీ ఐపీఎల్ 2025 రీస్టార్ట్ కోసం కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఫ్రాంచైజీలతో చర్చలు జరిపిన బీసీసీఐ, మే 15 లేదా 16వ తేదీ నుంచి మిగిలిన మ్యాచ్‌లకు రంగం సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, మే 13లోగా విదేశీ ఆటగాళ్లతో సహా అన్ని జట్ల ఆటగాళ్లు తమ హోమ్ వేదికలకు రిపోర్ట్ చేయాలని బీసీసీఐ సూచించింది. పంజాబ్ కింగ్స్‌ను మినహాయిస్తే, మిగతా జట్లన్నీ తిరిగి సిద్ధమవుతున్నాయని సమాచారం. ప్రత్యేకంగా, విదేశీ క్రికెటర్ల రీ ఎంట్రీ కోసం విమాన టికెట్ల సహా ఇతర ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
బోర్డు ప్రణాళిక ప్రకారం మే 25వ తేదీనే టోర్నీ ఫైనల్‌ను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మిగిలిన 12 లీగ్ మ్యాచ్‌లను డబుల్ హెడర్ మోడల్‌లో వేగంగా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అంటే, ఒక్కోరోజు రెండు మ్యాచ్‌లు జరిగేలా షెడ్యూల్ తయారవుతుంది.
ఇక పంజాబ్ కింగ్స్ హోమ్ వేదిక అయిన మొహాలీ, పాక్ సరిహద్దుకు సమీపంగా ఉండటంతో, ఆ జట్టు మ్యాచ్‌లను తటస్థ వేదికకు తరలించే అవకాశం ఉంది. హైదరాబాద్ లేదా ఇండోర్ వంటి నగరాలు ఆ ప్లేస్‌మెంట్ కోసం పరిశీలనలో ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యే ఈ క్రమంలో అభిమానుల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది.