టీమిండియా ఆటగాళ్ల క్రమశిక్షణ, ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీసీసీఐ క్రికెట్ జట్టుకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆటగాళ్ల ఫోకస్ దెబ్బతినడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వంటి అంశాలు ప్రధానంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో జట్టు సమగ్రత, ఫిట్‌నెస్, ప్రదర్శన పెంచడానికి ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చినట్లు బీసీసీఐ పేర్కొంది.
ఈ రూల్స్ ప్రకారం ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో పాటు వారి ఆటతీరును మెరుగుపరచడానికి, దేశవాళీ క్రికెట్ పటిష్ఠం అవ్వడానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. అలాగే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను వెంటబెట్టుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని నిబంధన విధించింది. 45 రోజులకు మించి ఉన్న పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా రెండు వారాల అనుమతి మాత్రమే ఇవ్వబడుతుంది.
జట్టులో సమిష్టి కృషిని పెంపొందించడానికి ఆటగాళ్లు కలిసి ప్రయాణించడం తప్పనిసరిగా చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు విధించి, హెడ్ కోచ్, సెలక్షన్ కమిటీ అనుమతులతో మాత్రమే వీటికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా, లగేజ్ పరిమితి కూడా 150 కిలోలుగా నిర్ణయించబడింది. ఆటగాళ్లు అదనపు బరువు తీసుకెళ్తే, దానికి సంబంధించి ఖర్చులు వారికి స్వయంగా భరించాల్సి ఉంటుంది.
ప్రత్యేక సిబ్బంది, భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకోవడం, కమర్షియల్ షూటింగ్స్‌లో పాల్గొనడం వంటి అంశాలపై కూడా బీసీసీఐ పలు ఆంక్షలు విధించింది. సిరీస్‌ల మధ్యలో వ్యక్తిగత ప్రకటనలు, షూటింగ్‌లలో పాల్గొనకుండా, జట్టు కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అలాగే, ప్రాక్టీస్ సెషన్‌లో పూర్తి సమయం అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. ఆటగాళ్ల నిబద్ధతను పెంపొందించడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం అని బీసీసీఐ తెలిపింది. జట్టు సమగ్రతను పెంచడం, క్రమశిక్షణలోనూ, ఆటలోనూ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం కోసం ఆటగాళ్లు ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.