రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం చూడని మహిళలు ఉంటారా? అనే అనుమానం కూడా వస్తుంటుంది. అంతలా తెలుగు మహిళా ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది. కార్తీక దీపంలో వంటలక్క అలియాస్ దీప (ప్రేమీ విశ్వనాథ్), డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ (నిరుపమ్)లు తమ నటనతో అందర్నీ కట్టిపడేశారు. ఇక శౌర్య, హిమ ఈ పాత్రలు కూడా బాగానే ఫేమస్. ఇప్పుడు కథ అంతా ఈ నలుగురి మధ్య జరుగుతోంది.
అయితే ఈ సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ నిత్యం నడుస్తూనే ఉంటాయి. అది వేరే విషయమనుకోండి. అయితే తాజాగా ఈ మధ్య హైద్రాబాద్‌లో చోట భూకంపం వచ్చి కాలనీ వాసులంతా బయటకు వచ్చారు. అందులో ఓ మహిళ కార్తీక దీపం సీరియల్ మిస్ అయ్యానని బాధపడిందట. భూకంపం వచ్చింది వార్త కాలేదు గానీ ఆమె కార్తీక దీపం సీరియల్ చూడలేదని వార్త అయిందంటే సీరియల్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత రెండ్రోజులుగా హైద్రాబాద్‌లో వానలు దంచికొడుతున్నాయి, నగరం మొత్తం అతలాకుతలమైంది. కాలనీలు మొత్తం మునిగిపోయింది. ఇంట్లోకి నీరు చేరి మనుషులు మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితిలోనూ కార్తీక దీపం సీరియల్‌ను మహిళలు వదలరు అని చెప్పే ఓ క్రేజీ కార్టూన్‌ను శౌర్య (బేబీ కృతిక) షేర్ చేసింది. అందులో ఇళ్లంతా మునిగి ఉన్నా కూడా భర్త మాత్రం నెత్తి మీద టీవీ పెట్టుకుని నిల్చుంటే భార్య ఎంచక్కా సీరియల్‌ను వీక్షిస్తోంది.