ఆదిపురుష్ అంటూ బాలీవుడ్ లో తొలి అడుగు పెట్టేస్తున్నాడు ప్రభాస్. ఆయన ఇప్పుడు నేషనల్ స్టార్. త్వరలో హాలీవుడ్ రేంజ్ కు వెళ్లబోతున్నాడు. ఎప్పుడైతే ఆదిపురుష్ సినిమాను ప్రభాస్ అనౌన్స్ చేశాడో.. వెంటనే ప్రభాస్ రేంజే మారిపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన సాహో అంతగా ఆకట్టుకోకపోయినా ప్రభాస్ పాపులారిటీ మాత్రం పెరుగుతూనే ఉన్నది.
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓసినిమా రాబోతున్నది. ఆ తర్వాత ఆదిపురుష్ పట్టాలకెక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు ఓం రావత్ డైరెక్టర్. భారీ బడ్జెట్ తోనే సినిమా రూపుదిద్దుకోబోతున్నది.
నిజానికి యాదృచ్ఛికమో లేక ఇంకేంటో కానీ.. ఓవైపు భారత్ లో దశాబ్దాల కల రామమందిరం నిర్మాణం జరుగుతుంటే.. మరోవైపు అదే రాముడి కథతో సినిమా వస్తుండటం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.
అయితే.. ప్రధాని మోడీతో కూడా ప్రభాస్ కు సత్సంబంధాలు ఉండటం.. ఆయన్ను ప్రభాస్ చాలాసార్లు కలవడం చేత… ఈ సినిమాలో అయోధ్య రామమందిరానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయేమో అని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ సినిమాలో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన భూమి పూజ సీన్ ఉంటే అది ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవలే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇక.. ఆదిపురుష్ సినిమా కోసం పవర్ పుల్ నటుల వేటలో పడింది సినిమా యూనిట్. ఇప్పటికే పలువురు పేర్లు తెర మీదికి వచ్చాయి. సీత రోల్ కోసం కీర్తి సురేశ్, దీపికా పదుకొణె లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించినా… చివరకు కియరా అద్వానీని మూవీ యూనిట్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఆదిపురుష్ లో విలన్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఓం రావత్.. తన గత మూవీ తానాజీలోనూ సైఫ్ అలీ ఖాన్ నే విలన్ రోల్ కోసం తీసుకున్నారు. ఇక.. ఆదిపురుష్ లో మరికొన్ని ముఖ్యమైన క్యారెక్టర్ల కోసం పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక.. ఈ సినిమా 2021 లో సెట్స్ మీదికి వెళ్లనుండగా… 2022 లో విడుదల కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కూడా 2022లోనే రిలీజ్ కానుండటంతో 2022 ప్రభాస్ నామ సంవత్సరంగా మారనుంది.