Prashanth Kishor : తూచ్.! ప్రశాంత్ కిషోర్ ‘చేతు’లెత్తేశాడహో.!

Prashanth Kishor : కొత్తగా ఎవరూ అనుకోవడానికేమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే చేరే అవకాశమే లేదని అంతా అనుకున్నారు.. అలా అనుకున్నట్టే జరిగింది. ఇదిగో కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చేరబోతున్నారు.. అదిగో కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ ఫలానా పదవి చేపట్టబోతున్నారు.. అంటూ జరిగిన ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది.

కాంగ్రెస్ పార్టీకి తన సలహాలు అవసరమని ప్రశాంత్ కిషోర్ ఇంకా భావిస్తుండడమే కాస్త ఆశ్చర్యకరం. కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల కోసం ఎన్నికల సలహాదారుగా, వ్యూహకర్తగా వ్యవహరిస్తాను తప్ప, ఆ పార్టీలో చేరడంలేదని తాజాగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించేశారు.

కాంగ్రెష్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ తమ పార్టీలో చేరబోవడంలేదని తేల్చి చెప్పింది. ‘ఆయన 2024 ఎన్నికలకు సంబంధించి మాకు విలువైన సూచనలు చేశారు.. మంచి సలహాలు కూడా ఇచ్చారు. ఈ విషయంలో ఆయన్ని మేం అభినందిస్తున్నాం..’ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

నిజమే, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే, ఆయన బయట వుండి సలహాలు ఇవ్వడమే ఆయనకు మంచిది. వందల కోట్లు ఆయనకు ‘సలహాలు’ ఇవ్వడం ద్వారా వస్తాయి మరి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, చాలా పార్టీలు ఆయన్ని సలహాదారుగా పెట్టుకుంటున్నాయి.

సో, సలహాలు ఇవ్వడం ద్వారా వచ్చే సంపాదన, పేరు ప్రఖ్యాతులు ప్రశాంత్ కిషోర్ ఎందుకు వదులుకుంటారు.?