చిత్రం సినిమాను అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. ట్రెండ్ సెట్టర్ అనే పదానికి నిదర్శనం ఈ సినిమా. దర్శకుడు ఎవరో తెలియదు.. హీరో ఎవరో తెలియదు.. హీరోయిన్ ఎవరో పరిచయం లేదు.. అసలు సినిమా పూర్తయ్యే వరకు విడుదలయ్యే సంగతి కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చి సంచలన విజయం సాధించింది చిత్రం.
2000లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఉదయ్ కిరణ్ కు లైఫ్ ఇచ్చింది. తేజ ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. నువ్వు నేను, జయంతో సంచలన విజయాలు అందుకుని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అలాంటి సంచలన సినిమాలు అందించిన తేజ.. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత చిత్రం సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడు.
ఫిబ్రవరి 22న పుట్టిన రోజు సందర్భంగా చిత్రం 1.1 పేరుతో చిత్రంకి సీక్వెల్ ప్రకటించాడు ఈ దర్శకుడు. ఇందులో 45 మంది కొత్త వాళ్లను పరిచయం చేయబోతున్నాడు తేజ. హీరో హీరోయిన్లతో పాటు అంతా నూతన నటీనటులే ఉండబోతున్నారు చిత్రం సీక్వెల్‌లో. ఈ సినిమా కోసం చాలా ఏళ్ళ తర్వాత ఆర్పీ పట్నాయక్ మళ్లీ సంగీతం అందిస్తున్నాడు. ఈయనకు తేజ కాంబినేషన్ బాగా కలిసొచ్చింది. కొన్నేళ్లుగా ఈయన సంగీతానికి దూరంగా ఉన్న ఆర్పీ, తేజ కోసం వస్తున్నాడు.
అప్పుడు చిత్రం సినిమాకు ఉదయ్ కిరణ్ దొరికాడు. ఇప్పుడు అలాంటి హీరో ఒకరు కావాలి. ఈ సారి బయటి వాళ్లను కాకుండా ఇంట్లోనే హీరోను వెతుక్కుంటున్నాడు తేజ. ఇప్పటికే చాలా మంది కొత్త వాళ్లను పరిచయం చేసిన తేజ ఇప్పుడు తన వారసుడిని పరిచయం చేయాలని చూస్తున్నాడు. తనయుడు అమితోవ్ తేజను హీరోగా పరిచయం చేయబోతున్నాడు తేజ. ఇప్పటికే ఈ కుర్రాడికి నటనలో శిక్షణ కూడా ఇప్పించాడు తేజ. తను రాసుకున్న కథకు తనయుడు బాగా సెట్ అవుతాడని భావిస్తున్నాడు తేజ.