తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ తన అభిమానులకు మరోసారి విజ్ఞప్తి చేశాడు. తనను (కడవులే అజిత్) దేవుడు అజిత్ అని పిలవవద్దని తెలిపాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ నోట్ విడుదల చేశాడు. ఇటీవల మూవీ ఈవెంట్‌లలో లేదా మీటింగ్స్‌లలో నన్ను (కా.. అజితే) కడవులే అజిత్ అని పిలుస్తున్నారు. ఈ పిలుపు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను ఇలాంటివి జీర్ణించకోలేకపోతున్నాను. దయచేసి ఇలా పిలవడం ఆపండి.
నేను నా పేరుతో మాత్రమే పిలవడానికి ఇష్టపడతాను. అజిత్ అని పిలవండి చాలు.. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కష్టపడి పని చేయండి. మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి మరియు చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఉండండి. అంటూ అజిత్ రాసుకొచ్చాడు. అయితే అజిత్ ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. తనను తలా అని పిలవవద్దంటూ అభిమానులను కోరాడు. దీంతో అభిమానులకు మళ్లీ విజ్ఞప్తి చేయడంతో ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
సినిమాల విషయానికి వస్తే.. అజిత్ ప్రస్తుతం ‘విదా ముయార్చి’ సినిమాతో పాటు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘విదా ముయార్చి’ సినిమాకు మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష కథానాయిక నటిస్తుంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకు ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.