Ajith Kumar: రేసింగ్ లో మళ్ళీ ప్రమాదానికి గురైన అజిత్.. కాస్త జాగ్రత్త తలా..

రేసింగ్ పట్ల కోలీవుడ్ హీరో అజిత్‌కుమార్ ఆసక్తి ఎంతో ప్రత్యేకమైనది. సినిమాలతో బిజీగా ఉన్నా కూడా రేసింగ్‌ను వదలకుండా అనుసరిస్తుండటం అభిమానులకు స్ఫూర్తిగా ఉంటుంది. అయితే, వరుసగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్న ఆయన తాజా రేసింగ్ యాత్ర కూడా గందరగోళమే మిగిల్చింది. బెల్జియంలో జరిగిన ‘సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్’ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు వేగంగా ఉండగా ట్రాక్‌పై అదుపు తప్పింది.

అదృష్టవశాత్తూ అజిత్‌కి ఎలాంటి గాయాలు కాకపోవడం మాత్రం అభిమానులకు ఊపిరి పీల్చుకునే అవకాశమిచ్చింది. ఇది మూడోసారి అజిత్ ప్రమాదానికి గురవడం. జనవరిలో దుబాయ్ రేస్ సమయంలో గోడను ఢీకొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. తరువాత స్పెయిన్‌లో కూడా మరో కారు దారిలోకి రావడంతో అజిత్ తన కారుతో తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యారు.

ఇప్పుడిలా మళ్లీ బెల్జియంలో ట్రాక్ బయటకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకోవడంతో… రేసింగ్ ప్యాషన్ మీద అభిమానులలో ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే అజిత్ మాత్రం ఎంతో కూల్‌గా స్పందించాడు. “రేసింగ్‌లో సాధారణమే… ఆందోళన అవసరం లేదు” అంటూ తన స్టైల్‌లో మాటిచ్చాడు. ఆయన టీమ్ షేర్ చేసిన వీడియోలో రేస్ సమయంలో జరిగిన ప్రమాద దృశ్యం స్పష్టంగా కనిపించింది. అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో “మీరు మాసు హీరో కావచ్చు కానీ కాస్త జాగ్రత్తలతో రేస్ చేయండి” అంటూ సూచనలు చేస్తున్నారు.

ఇక సినిమాల పరంగా అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మంచి హిట్‌గా నిలిచింది. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. త్వరలోనే అజిత్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పట్లో మాత్రం రేసింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

పాప మాటలకు ఏడ్చేసిన జగన్ || Ys Jagan Emotional On Student Speech || Telugu Rajyam