‘ఏజెంట్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌ పై ‘‘స్టే’’

అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్‌ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌ 23 న రిలీజ్‌ అయి భారీ పరాజయాన్ని అందుకుంది. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ లాంటి హిట్‌ తరువాత పాన్‌ ఇండియా సినిమాగా ఏజెంట్‌ ను మొదలుపెట్టగా అఖిల్‌ కష్టపడి బాడీ పెంచాడు.

సినిమా మొదలుపెట్టినప్పటినుంచి ఎన్నో వాయిదాల తరువాత ఏప్రిల్‌ లో రిలీజ్‌ అయ్యింది. అయితే సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నా అది కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. అనుకోని విధంగా ఈ సినిమా ఓటిటీ డేట్‌ ను అనౌన్స్‌ చేశారు. ఏజెంట్‌ డిజిటల్‌ హక్కులు సోనీ లివ్‌ సొంతం చేసుకున్న క్రమంలో సెప్టెంబర్‌ 29 నుంచి సోనీలివ్‌ లో ఏజెంట్‌ స్ట్రీమింగ్‌ కానుందని అనౌన్స్‌ చేశారు.

అయితే వైజాగ్‌ కు చెందిన పంపిణీదారుడు బత్తుల సత్యనారాయణ (వైజాగ్‌ సతీష్‌,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని, నిర్మాత అనిల్‌ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ న్యాయం కోరుతూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఆయన వాదనలు విన్న తర్వాత ఈ నెల 29 న ఏజెంట్‌ చిత్రం ఓటిటి లో స్ట్రీమింగ్‌ కాకుండా కోర్టు స్టే (యధాతథస్థితి) ఇచ్చిందని అడ్వకేట్‌ కేశాపురం సుధాకర్‌ తెలిపారు. దీంతో అభిమానులకు మరోసారి ఈ సినిమా రిలీజ్‌ విషయంలో షాక్‌ తగిలిందని చెప్పొచ్చు.