Malasree : తెలుగులో ఒక తరం సినిమాల్లో బాగానే పాపులర్ అయిన హీరోయిన్ మాలశ్రీ. సాహసవీరుడు సాగర కన్య, ప్రేమ ఖైదీ, భలే మావయ్య సినిమాలతో తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. ఇక కన్నడ నాట మాలశ్రీ క్రేజ్ వేరు. హీరోలతో సమానంగా యాక్షన్ సినిమాలు తీసి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.
తెలుగు సినిమాలలో మంచి స్థాయిలో ఉన్నపుడు, కన్నడ చిత్రసీమలో అడుగు పెట్టిన మాలశ్రీ శాండల్ వుడ్ లో స్థిరపడిపోయారు. సాహసవీరుడు సాగర కన్య వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించి వెంటనే కన్నడ సినీ నిర్మాత ను పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్య పరిచారు.చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక టెలివిజన్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు మాలశ్రీ.
సాహసవీరుడు సాగరకన్య’ తర్వాత పెళ్లి చేసుకున్నానని, అదే సమయంలో కన్నడలో బిజీ అయిపోయానని చెప్పుకొచ్చింది. అక్కడ వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ యాక్షన్ హీరో అయిపోయానని తెలిపింది. నాతో సినిమా చేయాలనుందని నిర్మాత రాము అడగడంతో ఆయనతో ముత్యనంత హెంతి (ముత్యం లాంటి పెళ్లాం) మూవీ చేశానని తెలిపింది. అంతేకాదు, ఆయనకు ముత్యంలాంటి పెళ్లాం దొరకాలని ఆరోజు ప్రెస్‌మీట్‌లో కూడా చెప్పానని, కానీ చివరకు తనే ఆయనకు భార్యనవుతానని అనుకోలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే ఒకసారి ఒక ఏడాదిలో 14 సినిమాలు చేశానంది. ప్రేమఖైదీ పెద్ద హిట్ కావడంతో రామానాయుడు తనకు, హీరోకు ఖరీదైన వాహనాలను బహుమతిగా ఇచ్చాడన్న విషయాన్ని వెల్లడించింది. గతేడాది తన భర్త రాము చనిపోగా ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకుంది మాలశ్రీ.