ఆదిపురుష్ త్రీడీ ఎఫెక్ట్.. స్పెషల్ ఫోకస్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పౌరాణిక చిత్రం ఆది పురుష్. రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. జూన్ లో భారీ ఎత్తు థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగిన తర్వాత ట్రైలర్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.

జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ఆదిపురుష్ టీమ్ త్రీడీలో విడుదలయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే త్రీడీ ఎఫెక్ట్ పై ప్రత్యేక దృష్టి సారించిందట. త్రీడీ అవుట్ పుట్ ను పూర్తి స్థాయిలో మెరుగు పరిచేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా కేటాయించిందట. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు అద్భుతమైన త్రీడీ వీక్షణ అనుభూతిని కల్పించాలనే ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నట్లు అర్థం అవుతోంది.

త్రీడీ ప్రొజెక్షన్ సదుపాయం అందుబాటులో ఉన్న ప్రతిచోటా సినిమాను 3డీలో చూడాలాని టీమ్.. ప్రేక్షకులకు సలహా ఇస్తోంది. త్రీడీ ప్రొజెక్షన్ ద్వారా సీజీఐ ఎఫెక్ట్‌లు బాగుంటాయని, వీక్షకులకు కొత్త అనుభూతిని అందించగలమనే గట్టి నమ్మకంతో ఉంది యూనిట్. అయితే ఆదిపురుష్ సినిమాలో రాఘవగా ప్రభాస్, లంకేష్ గా సైఫ్ అలీఖాన్, జానకిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, దేవదత్ నాగే హనుమంతుడిగా నటించారు.

రామాయణ ఇతిహాసం కాబట్టి పెద్ద ఎత్తున భారతీయులు సినిమా చూసే వీలుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.ఈ క్రమంలోనే వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇండియా మొత్తం 8 వేల థియేటర్లు, రోజుకు సుమారు 35 వేల కంటే ఎక్కువ షోలు పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

అజయ్-అతుల్ సంగీతం అందించగా.. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను విడుదల చేస్తోంది. త్రీడీ, ఐమాక్స్ ఫార్మాట్స్ లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. సినిమా చూసేందుకు సిద్ధమవ్వండి.