నా పెళ్లికి రండి సార్‌.. ప్రధాని మోదీని ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్‌ కుమార్‌

ప్రధాని మోదీని పెళ్లికి ఆహ్వానించారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ విూడియాలో పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా వరలక్ష్మి టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులను ఆమె స్వయంగా వెళ్లి పిలిచారు. తాజాగా కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధానిని ఆహ్వానించారు. ఈ ఫొటోలను వరలక్ష్మి ఎక్స్‌లో షేర్‌ చేస్తూ మోదీకి థ్యాంక్స్‌ చెప్పారు. ప్రధానిని కలవడం ఆనందంగా ఉందన్నారు.

ఆయన బిజీ షెడ్యూల్‌లో కూడా తమతో మంచి సమయం గడిపినట్లు తెలిపారు. చాలా గౌరవంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శరత్‌కుమార్‌కు కూడా ఆమె ధన్యవాదాలు చెప్పారు. సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా తన వైవిధ్యమైన నటన, విలన్‌ పాత్రలతో వరలక్ష్మి ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌తో త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతున్నారు. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి సింపుల్‌గా చేసుకుంటున్నా రిసెప్షన్‌ మాత్రం చెన్నైలో గ్రాండ్‌గా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.