మన దేశంలో ప్రస్తుతం కరోనా తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా కరోనా విజృంభిస్తోంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా అంటే జనాలకు భయం లేకుండా పోతోంది. ఇప్పటికీ కొందరు మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరాన్ని పాటించడం లేదు. కానీ వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను రోజంతా ధరిస్తూనే ఉంటారు. చేతికి గ్లౌవ్స్, ఫేస్‌కు మాస్క్ ఇలా రోజంతా పెట్టుకునే ఉంటారు. మనం కోసం వారు ఎంత కష్టపడుతున్నారో చెబుతూ స్వయంగా తన అనుభవాలను చెబుతోంది సీనియర్ హీరోయిన్ మీనా.
మీనా తాజాగా చెన్నై నుంచి కేరళకు బయల్దేరినట్టు తెలుస్తోంది. ఈ మధ్యే దృశ్యం 2 ప్రారంభమైంది. మోహన్ లాల్‌తో ఆల్రెడీ షూటింగ్ ప్రారంభించేశారు. ఇక మీనా ఆ షూటింగ్‌లో జాయిన్ కావాల్సి ఉంది. అందుకే మీనా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఫ్లైట్‌లో కేరళకు వెళ్లింది. ఈ క్రమంలోనే మీనా పీపీఈ కిట్ ధరించింది. దాన్ని వేసుకుంటే అనుభవించే బాధలు, కష్టాలను తెలిపింది. ‘ఏదో స్పేస్‌కు వెళ్తోన్నట్టు నేను కనిపిస్తున్నాను. కానీ నేను ఓ యుద్దాన్ని చేయడానికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నాను. దాదాపు ఏడు నెలల తరువాత.. ఈ ఏయిర్ పోర్ట్‌ను ఇలా కామ్‌గా, ఇలా ఎడారిలా చూడటం ఆశ్చర్యంగా ఉంది. నాలా చాలా మంది డ్రెస్ ధరించలేదు… అది నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
మామూలుగా చెప్పాలంటే.. ఇది అసల కంఫర్ట్‌గానే ఉండదు. ఎంతో వేడిగా ఉంటుంది.. చుట్టూ ఏసీ ఉన్నా గానీ లోపల మాత్రం చెమట పడుతుంది. ఈ గ్లౌవ్స్ ఉండటంతో కనీసం మన మొహాన్ని మన చేతులతో తుడుచుకోలేం. రోజంతా ఈ పీపీఈ కిట్లను ధరించి మనకు సేవ చేసే వైద్య బృందానికి హ్యాట్సాప్. వీటిని ధరించడం ఎంత అసౌకర్యంగా ఉన్నా కూడా వారు మనం కోసం, మన ఆరోగ్యాల కోసం ఆలోచిస్తుంటారు. మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు.. వారికి చేతులెత్తి మొక్కాల్సిందే. మీ నిస్వార్థ సేవకు ధన్యవాదాలు’ అని మీనా పేర్కొంది.